గజ్వేల్, ఏప్రిల్ 13: ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి లక్షమంది జనసమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, పార్టీ శ్రేణులు సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం గజ్వేల్‌లోని శోభాగార్డెన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సభ ఎంతో ప్రతిష్టాత్మకమైందని, ప్రతి కార్యకర్త సమయానికి ప్రాంగణానికి చేరుకోవాలన్నారు.
కేసీఆర్ స్పీచ్ విని జైతెలంగాణ అన్న తర్వాతనే అక్కడి నుంచి ఇంటికి చేరుకోవాలన్నారు. క్రమశిక్షణ కలిగిన ఉద్యమకారులం మనం అని, అదే క్రమశిక్షణతో సభకు చేరుకొని విజయవంతం చేయాలని కోరారు. రేవంత్ సర్కార్ హామీల విస్మరణపై గ్రామాల్లో చర్చ పెట్టాలని క్యాడర్‌కు సూచించారు. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ గెలిచిందో, అంతే స్పీడ్‌గా ఆదరణ కోల్పోయిందని, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మనమే గెలుస్తామని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ పాలనలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఎవరిని కదిలించినా పరేషాన్లో ఉన్నట్లు తెలిపారు. కొడుకో, కూతురో పెండ్లి చేద్దామంటే ఉన్న ఇల్లు కుదవపెడతామన్నా ఎక్కడ పైసా పుట్టని పరిస్థితి ఉందన్నారు. ప్రజలు రేవంత్ పాలనపై విసిగిపోయారని, గజ్వేల్‌లో 20వేల మంది రైతులకు ఇంకా పంట రుణమాఫీ కాలేదన్నారు. చిన్నకోడూరు మండలంలో 7300 మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని తెలిపారు.
గ్రామాల్లో కేసీఆర్ హయాంలో ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టామని, అందరినీ సభకు ఆహ్వానించాలన్నారు. జూన్, జూలైలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతాయని, ఈ సభకు వచ్చిన వారు కేసీఆర్ ప్రసంగం వింటే అంతే ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి 15వేల మంది జనసమీకరణ లక్ష్యంగా కాగా, టార్గెట్‌కు మించి సభకు ప్రజలను తరలించాలని, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నేతలకు హరీశ్‌రావు ఆదేశించారు.
భవిష్యత్ గజ్వేల్దే…
ఏమీ కోల్పోయామో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నదని, ఎవరు దిగులు పడొద్దని, భవిష్యత్ గజ్వేల్దే అని హరీశ్‌రావు అన్నారు. స్థానిక ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లో మనమే గెలుస్తామని, బీజేపీకి ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ హయాంలో ఇండ్లు, దుకాణాలు కిరాయికి దొరికేవి కావని, ఇప్పుడు ఎటుచూసినా ఇండ్లు, దుకాణాలకు టూ లేట్ బోర్డులు కన్పిస్తున్నాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై అన్నివర్గాలు విగిసిపోయారన్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ సర్కార్ అబద్ధ్దాలతో కాలం గడుపుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గురుకులాలు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు.
అనంతరం వరంగల్ సభకు సంబంధించిన కరపత్రాలను హరీశ్‌రావు ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజమౌళి, రవీందర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు దేవీ రవీందర్, నాయకులు శేఖర్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, యాదగిరి, మండలాల పార్టీ అధ్యక్షులు బెండ మధు, కరుణాకర్‌రెడ్డి, నవాజ్‌మీరా, శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.