సంగారెడ్డి, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్ పార్టీ బేజార్ అయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన శనివారం సంగారెడ్డిలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్ల సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన 32 మంది సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను సన్మానించారు.
బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన జీపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటి చెప్పిందని చెప్పారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, మద్యం ఏరులై పారించినా బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు కాంగ్రెస్ ఎదురొడ్డి ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధించారని కొనియాడారు. కొండాపూర్ మండలంలో కాంగ్రెస్‌ను ఢీకొట్టి బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందటం అభినందనీయమన్నా రు. ప్రజలు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచి 40 శాతం సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను సర్పంచ్‌లుగా గెలిపించినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరుకు భయపడి సీఎం రేవంత్ పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు.
ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నూతన సర్పంచ్‌లు అధైర్యపడవద్దని, ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ అవుతాయని, ఆ నిధులను ఖర్చుచేసే అధికారం కేవలం సర్పంచ్‌కు మాత్రమే ఉంటుందన్నారు. దేశంలో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్‌లకు మాత్రమే చెక్‌పవర్ ఉందన్నారు. సర్పంచ్‌లు తమ గ్రామాల్లో అభివృద్ధ్ది, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రెండేండ్ల తర్వాత కేసీఆర్ సర్కార్ రావడం ఖాయమని, అప్పుడు బీఆర్ఎస్ సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. త్వరలోనే బీఆర్ఎస్ సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. గెలిచిన సర్పంచ్‌లకు బాధ్యత ఉంటుందని, ఓడిపోయిన సర్పంచ్‌లకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఓటమి పాలైన సర్పంచ్‌లు నిరాశకు గురికావద్దని ప్రజల సేవలు ఉంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటం ఖాయమని సూచించారు.
బీఆర్ఎస్ వెన్నంటి ప్రజలు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 35 మంది సర్పంచ్‌లు గెలిచినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా ప్రజలు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం పాల్పడటంతో పాటు పోలీసులు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత ముకీం మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ నేత మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. పోలీసుల అండతో కాంగ్రె స్ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు మల్లాగౌడ్, హకీం, మనోహర్గౌడ్లు ప్రసంగించారు. బీఆర్ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, నరహరిరెడ్డి, శివరాజ్పాటల్, చింతా గోపాల్, మందుల వరలక్ష్మి, డా.శ్రీహరి, విఠల్, వెంకటేశ్వర్లు, చీలమలన్న, చక్రపాణి, కొండల్‌రెడ్డి, పాండురంగం, సరళ పుల్లారెడ్డి పాల్గొన్నారు.