సిద్దిపేట, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందని, వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నా సంక్షేమాన్ని ప్రభుత్వం మరిచిందని హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో నాయకులు రాజనర్సు, కనకరాజు, వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పెంచిన లైఫ్ ట్యాక్సిని, సర్వీసు చార్జీని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.ఆర్టీఏ ట్యాక్స్ రూ. 2 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పన్నులు తగ్గించి సంక్షేమ పాలన అందిస్తే, రేవంత్ సర్కారు బతుకు భారం చేస్తున్నదని అన్నారు. అభివృద్ధి కుంటుపడిందని, హామీలు, ఆరుగ్యారెంటీలు అటకెక్కినట్లు విమర్శించారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. స్టాంప్ అండ్ రిజిస్టేషన్ ఆదాయం తగ్గిపోయిందన్నారు. కాంగ్రెస్ సర్కారు విధానాలతో వ్యాపారాలు నెమ్మదించాయని, ప్రజల చేతుల్లో, మార్కెట్లో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికలప్పుడు ఓమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతూ రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నాడని హరీశ్‌రావు విమర్శించారు.
రేవంత్‌వి సుద్దపూస మాటలు అని ఎద్దేవా చేశారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. ప్రజల చేతిలో డబ్బులు లేవన్నారు. రేవంత్ పాలన తిరోగమణ దిశలో ఉందని హరీశ్‌రావు అన్నారు. పన్నులు పెంచి నడ్డి విరువడమే మార్పా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆర్అండ్బీ శాఖ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అన్యూటీ మోడల్ ద్వారా రోడ్లు వేయాలని కుట్ర చేస్తుందని హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్ సర్కార్ పంచుడు బంద్ చేసి పెంచుడు షురూ చేసిందని హరీశ్‌రావు మండి పడ్డారు. రైతుల విత్తనాల ధరలు పెంచిండు. బస్సు టికెట్ ధరలు, మద్యం ధరలు, రోడ్డు ట్యాక్స్ పెంచిండు,రేపోమాపో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచబోతున్నారన్నారు. ధరలు పెంచుడు తప్పా..మరోటి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. పింఛన్లు పెంచడం లేదని, తులం బంగారం పత్తాలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని, రైతులకు పంట రుణమాఫీ సగం కూడా కాలేదన్నారు. మద్యం ధరలు రెండు సార్లు పెంచారని, ఊరూరికి వైన్స్ షాపులు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. మండలాలు, తాలూకా కేంద్రాల్లో బ్రేవరేజీలు ఏర్పాటు ఆలోచనను ఉపసంహరించుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.