సిద్దిపేట, ఆగస్టు 17: రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సమస్యలు పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ర్ట కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మతో కలిసి విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ బురద రాజకీయాలు మానుకొని సముద్రంలో వృథాగా పోతున్న వరదా జలాలను ఒడిసి పట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్లను నింపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల విలువ తెలియడం లేదన్నారు. కేసీఆర్ ప్రతి నీటిచుకను ఒడిసిపట్టి రైతులకు అందించారని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలు కాగా, అందులో టీఎంసీ నీరు మాత్రమే ఉన్నదన్నారు. 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్లో కేవలం 10 టీఎంసీల నీళ్లు ఉన్నట్లు తెలిపారు.
కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు కాగా, నాలుగు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. రిజర్వాయర్లలో వెంటనే వీటిని నింపి రైతులకు నీళ్లు అందించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిందని చేసిన దుష్ప్రచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోటర్లు ఆన్ చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖకు మంత్రి ఉన్నాడా.. సీఎంకు సోయి ఉన్నదా? అని ప్రశ్నించారు. జిల్లాలోని రిజర్వాయర్లన్నీ నింపితే యాసంగిలో లక్షల ఎకరాల్లో పంట పండుతుందన్నారు. వానకాలంలో సగం సాగు కూడా కాలేదన్నారు. నీటిని ఒడిసిపడితే యాసంగిలోనైనా పూర్తి పంట పండే అవకాశం ఉందన్నారు.
ఎల్లంపల్లి ఏడు మోటర్లు ప్రారంభించి రోజుకు రెండు టీఎంసీలు నీళ్లను మిడ్‌మానేరుకు, అకడి నుంచి రోజుకు టీఎంసీని ఎత్తిపోసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు నింపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోసపెడుతున్నదన్నారు. ఎరువుల కోసం, పంట బీమా కోసం, కరెంటు ఇవ్వడానికి, ఆఖరికి నీళ్లను ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. మోటర్లు ఆన్ చేయడం చేతకాకపోతే తామే వేలాదిమంది రైతులతో కదిలి వెళ్లి ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు హెచ్చరించారు. నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు అన్నారు.
మళ్లీ పాత రోజులు తెచ్చిన కాంగ్రెస్…
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ రైతులు ఎరువు బస్తాల కోసం అరుగుల మీద పడుకోలేదని, కాంగ్రెస్ వచ్చి ఈ మార్పు తెచ్చిందని.. మళ్లీ పాత రోజులు వచ్చాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చెప్పులు లైన్లో పెట్టి అరుగుల మీద పండుకునే రోజులు వచ్చాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేయడంలో ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆరోపించారు. రాజకీయాల కోసం మాట్లాడటం లేదని, రైతుల కోసం మాట్లాడుతున్నానని, రైతుల పక్షాన మాట్లాడుతున్నానని హరీశ్‌రావు అన్నారు.
మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నానని, నా జిల్లా రైతులు, రాష్ట్రంలో రైతులు దెబ్బతింటారనే ఆవేదనతో మాట్లాడుతున్నానని హరీశ్‌రావు అన్నారు. తన సిద్దిపేట నియోజకవర్గంలో 72వేల ఎకరాలకు సాగునీరు రావాలనే మాట్లాడుతున్నట్లు చెప్పారు. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల వాటాలు పంచుకోవడానికే మీకు సమయం సరిపోతలేదు, ఇంకా పరిపాలన ఏడ చేస్తారని ఎద్దేవా చేశారు. సమావేశంలో సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, నాయకులు గుండు భూపేశ్, మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, ముల్కల కిషన్‌రెడ్డి, కోల రమేశ్, ఎల్లారెడ్డి, పోచబోయిన శ్రీహరి యాదవ్, నాయకం లక్ష్మణ్, బెల్లె రాములు, బెబల్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.