జహీరాబాద్, మే 21: జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఈనెల 23న జహీరాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ ఏముఖం పెట్టుకొని వస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం జాడీ మల్కాపూర్‌లోని దుర్గాదేవి జాతరకు ఆయన హాజరయ్యారు.
అనంతరం జహీరాబాద్‌లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మంజూరైన పథకాలకు ప్రారంభించడం చూస్తే సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా సీఎం రేవంత్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో నిధులు మంజూరు చేసి నిమ్జ్ రోడ్డు, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. బసవేశ్వర విగ్రహ ఏర్పాటుకు తామంతా కృషి చేశామన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బీబీపాటిల్ ఉన్నప్పుడు తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్లి కేంద్రీయ విద్యాలయాన్ని మంజురు చేయించినట్లు చెప్పారు. కేంద్రీయ విద్యాలయం ప్రా రంభమై విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో దానిని ప్రారంభించడానికి సీఎం వస్తుండడం విడ్డూరంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్ ప్రాంత ప్రజల మీద సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే వాపస్ తీసుకున్న నిధులను వెంటనే ఇవ్వాలన్నారు. పాతవి కొత్తవి కలిసి రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సర్పంచులు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.
కాంగ్రెస్ పాలన రైతులకు ఇబ్బందులు…
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో వర్షకాలం సీజన్ ప్రారంభమైందన్నారు. రైతులు సాగు చేసేందుకు అవసరమయ్యే జీలుగ, జనుము విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు మందుగానే స్టాక్ పెట్టి అందుబాటులో ఉంచేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మద్యం ధరలతో పాటు జీలుగ, జనుము విత్తనాల ధరలను పెంచిందన్నారు. వానకాలం సీజన్‌కు విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాను నేషనల్ సీడ్ కార్పొరేషన్‌కి అప్పజెప్పినా కేంద్రం విత్తనాలు ఇవ్వ డం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విత్తనాలు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. వర్షాలకు ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులకు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర మంత్రులు, సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించిన దాఖలాలు లేవన్నారు. ధాన్యం కోనుగోలులో తరుగు పేరిట రైతులకు నిలువునా దోచుకొని అన్యాయం చేస్తున్నారన్నారు. యాసంగి సీజన్లో సన్నబియ్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం బోగస్ చేసిందన్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ. 850 కోట్ల బోనస్‌లో ఒక రూపాయి చెల్లించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేసిందన్నారు.
రైతుబంధు కింద జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు రూ. 100 కోట్లకు పైగానే రైతులకు ఆర్థిక సహాయం వచ్చేదన్నారు. వానకాలం, యాసంగి సీజన్లకు గత ప్రభుత్వంలో ఎకరానికి రూ. 10 వేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ. 15 వేలు ఇస్తామని మూడు ఎకరాలకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొందన్నారు. నోట్ల రద్దు, కరోనా వచ్చినా ఎప్పుడూ రైతుబంధు ఆగలేదన్నారు. రెండు పంటలకు సంబంధించి రైతు బంధును ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.ఫిబ్రవరిలో రైతుబీమా పథకానికి చెల్లించాల్సిన ప్రీమి యం డబ్బులను చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వివిధ కారణాలతో మృతిచెందిన పరిహారం రాకపోవడంతో రైతు కుటుంబాలకు అన్యాయం జరుగుతోందన్నా రు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, పేదలు, రైతులకు కేసీఆర్ పంచిపెట్టారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మద్యం ధరలు పెంచి, చివరికీ విత్తనాల ధరలు కూడా పెంచుతావా అంటూ రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులు, పేద ప్రజల రక్తమాంసాలను పీలుస్తూ ప్రజల నుంచి సొమ్మును గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినప్పటికీ, నేటికి అమలు కావడం లేదన్నారు.
గతేడాదితో పాటు ఈసారి పంట నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 21 వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేపడుతున్నప్పటికీ, రైతులకు చెల్లించాల్సిన రూ. 72 కోట్లను ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదన్నారు. 48గంటల్లో జొన్న డబ్బు లు చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పినా, 48 రోజులైనా చెల్లించలేదన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నాయకులు మాణిక్యం పాల్గొన్నారు.