సిద్దిపేట, మార్చి 30 : విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని బ్రాహ్మణ పరిషత్‌లో జరిగిన ఉగాది ఉత్సవంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యం ఉండేదని, రానురాను పత్రికలతో పాటు పంచాంగం వచ్చేస్తుందని, రాశిఫలాల ఆధారంగా చదువుకోవడం అలవాటైందన్నారు.
గతంలో ప్రజలు ఆసక్తిగా చూసేవారని, ఇప్పుడు ఫోన్లోనే చూసుకోవడం అలవాటై పంచాంగ శ్రవణానికి ప్రాధాన్యం తగ్గిందన్నారు. ఆచార సంప్రదాయాలు ముందుతరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. నరసింహశర్మగారు గేయ రామాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారని, వారు కోరిన విధంగా ఆధ్యాత్మికంగా సిద్దిపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మిమ్ముల్ని చాలా గౌరవంగా సతరించి సన్మానించుకుంటామన్నారు.
కేసీఆర్ గురించి అందరూ చెప్పారని.. నిజంగా చెప్పాలంటే వారు బ్రాహ్మణ బంధువు అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి బ్రాహ్మణ పరిషత్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆలయాల్లోని హుండీల్లో డబ్బులు వస్తేనే పూజారులకు జీతం వచ్చే పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెలా మొదటి తేదీ దేవాలయ ఉద్యోగులకు జీతాలు వచ్చేలా చేశారన్నారు.
యాదాద్రి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిఉంటే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేవారన్నారు. సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని చకగా చేసుకున్నామని, వాస్తుకు ఇబ్బంది ఉందంటే మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు, ప్రభుత్వాలు చేయలేని పని దేవుడి పేరుమీద ఎంతో క్రమశిక్షణతో చేస్తామన్నారు. పిల్లల జీవితంలో మార్పు, చెడు అలవాట్లను దూరం చేయగలుగుతామన్నారు.
పాతరోజుల్లో ఇంట్లో తిని సద్దికట్టుకుని బయటకు వెళ్లేవారు, ఇప్పుడు బయటతిని కావాల్సి వస్తే డబ్బా కట్టుకుని ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. గుణాత్మక మార్పు తేవాలంటే అది కేవలం ఆధ్యాత్మికత వల్లే సాధ్యమవుతుందన్నారు. పిల్లలు అభివృద్ధితో పోటీపడుతూ తెలుగు భాషను మర్చిపోతున్నారని, విదేశాల్లో ఉండే పిల్లలకు సంప్రదాయం,ఆచారాలు, పండుగలను చకగా నేర్పిస్తున్నారన్నారు. ఇకడ మనం మన సంప్రదాయాన్ని, భాషను మర్చిపోతున్నామన్నారు.
విదేశాల్లో ఉండే మన తెలుగువారు బతుకమ్మ ఆడి బోనాలు తీస్తున్నారన్నారు. సిద్దిపేటలో టీటీడీ ఆధ్వర్యంలో మరో వేంకటేశ్వరస్వామి ఆలయానికి శంకుస్థాపన చేయనున్నామన్నారు. పెద్ద జీయర్‌స్వామి చేతుల మీదుగా వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రారంభించుకున్నామని చినజీయర్‌స్వామి చేతుల మీదుగా స్వర్ణోత్సవం జరుపుకుందామన్నారు. చకగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్‌కు ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్దిపేట మట్టి గొప్పదని, ఇక్కడి సాంస్కృతిక సాహిత్య వాతావరణ ప్రేరణతో ఇంతగొప్పవాడిని అయ్యానన్నారు. ఇక్కడి వాతావరణంలోనే సాంస్కృతిక సాహిత్య పరిమళాలు విరాజిల్లాయన్నారు. బ్రాహ్మణ పరిషత్ అభివృద్ధికి ఎమ్మెల్సీగా తనవంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, కేసీఆర్ గురువు వేలేటి మృత్యుంజయశర్మ, అడ్వకేట్ మంగు హరిహరరావు, విఠలశ్రీకాంత్శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కలకుంట్ల రంగాచారి, కవులు, పురోహితులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.