నర్సాపూర్, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ హయాం లో రూ.8లక్షల కోట్ల అప్పులు అయ్యాయని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కేవలం రూ.3.46 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయ్యిందని పదేపదే కేటీఆర్, హరీశ్‌రావు చెబుతున్నా, కాంగ్రెస్ నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. హామీలు ఇచ్చేటప్పుడు రాష్టంలో అప్పులు ఉన్నాయని కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. నర్సాపూర్‌లో శనివారం చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన రసాభసపై ఆమె స్పందించారు. పదేండ్లలో పార్టీలకు అతీతంగా అన్నివర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారని, ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోటా కింద 1400 ఇండ్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 400 ఇండ్లు మంజూరు చేశారని, అవి కూడా ఇవ్వడానికి 100 సార్లు తిప్పిచ్చుకున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యే కోటా ఇండ్లు ఇవ్వకుండా కేవలం రాజకీయ కుట్రలు చేసి ఆపాలని చూశారని విమర్శించారు. మహిళలకు రూ.2500 కోసం ఎదురు చూస్తున్నారని, తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జి మంత్రిని మేము గౌరవిస్తామన్నారు, కానీ, అధికారిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా మార్చారన్నారు. రౌడీలు, గుండాల్లా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఫెయిల్ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో తెలంగాణను దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిపితే, కాంగ్రెస్ పాలనలో దేశంలోనే చివరి స్థానంలో తెలంగాణ ఉందని, కాంగ్రెన్ నేతలు కేసీఆర్ కాలు గోటికి సరిపోరని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు.
ప్రభుత్వం సరిగ్గా వ్యవహరిస్తే ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీలో అప్పుడు ప్రచారం, ఇక్కడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరుగ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు నిలదీస్తామని అన్నారు. నర్సాపూర్‌లో డీఎస్పీ ఆఫీసు లేదన్నారు. ఆర్డీవో, తహసీల్ ఆఫీసులకు పక్కాభవనాలు లేవన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రాగౌడ్, చంద్రశేఖర్, మన్సూర్, రామాగౌడ్, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.