చిన్నకోడూరు, ఫిబ్రవరి 6: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలలపల్లిని ముంపు గ్రామంగా గుర్తించి, వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్యాకేజీ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలం చెలలపల్లి గ్రామ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ(అంతగిరి) రిజర్వాయర్ నిర్మించారు. నిర్మాణంలో భాగంగా పకన ఉన్న కొచ్చగుట్టపల్లి గ్రామంలో 104 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించి ప్యాకేజీ, ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి ఇచ్చారు. దీనికి 50 మీటర్ల దూరంలో చెలలపల్లి గ్రామం ఉంటుందని లేఖలో పేరొన్నా రు.
ఆ గ్రామంలో అప్పడు ఎఫ్‌ఆర్‌ఎల్‌లో రెండు ఇండ్లు, నాలుగు కుటుంబాలు మాత్రమే ముంపునకు గురికావడంతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అదనపు టీఎంసీ కోసం జరుగుతున్న పంప్‌హౌస్ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్, డంప్ యార్డ్ నిర్మాణంతో గ్రామానికి మూడు వైపులా అన్నపూర్ణ రిజర్వాయర్ నీళ్లు ఇండ్లకు చేరడంతోపాటు, డ్రైనేజీ ఇండ్లల్లోకి రావడం, చుట్టుపకల డంప్ చేయడం, సరైన సెల్ సిగ్నల్స్ లేకపోవడం, ఉన్న ఒక రోడ్డు మార్గం ఈ పనుల్లో తీసేయడంతో రవాణా సౌకర్యం లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం నా దృష్టికి రావడంతో ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు.
గతంలో సిద్దిపేట కలెక్టర్, ఆర్అండ్ఆర్ కమిషనర్‌కు ఈ విషయాలపై లేఖ రాశారని, ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని చెలలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి, నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీతోపాటు ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించాలని హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 17 రోజులుగా గ్రామస్తులు నిరాహార దీక్ష, ధర్నాలు చేస్తున్నారని, వెంటనే ప్రభుత్వం చొరవ చూపి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి ఆదుకోవాలని కోరారు. గతంలోనే ఆర్అండ్ఆర్ కమిషనర్‌కు, కలెక్టర్ లేఖ రాశారని, ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడి విషయాన్ని వివరించారు.