రామచంద్రాపురం, జూన్ 18 : అనారోగ్యం కారణంగా సుమారు పదినెలలుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండి వైద్య చికిత్స తీసుకున్న ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి బుధవారం సన్నిహితులు, పార్టీ ముఖ్యనేతలు, అభిమానులతో లక్ష్మీగార్డెన్స్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో ఆయన మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా ఎలాంటి కార్యక్రమాలకు రాలేకపోయానని తెలిపారు. భగవంతుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో ఇప్పుడు ఆరోగ్యం కాస్త సహకరిస్తున్నదని, త్వరలో అందరినీ కలుస్తా అన్నారు.
క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనే ఓపిక లేదని, రాజకీయంగా ఎదిగే వారికి తనవంతు సలహాలు, సూచనలు ఇస్తూ సహకరిస్తానని తెలిపారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి నేటి వరకు ఎక్కడా ఎలాంటి అవినీతి, ఆరోపణలు, రాజకీయ కక్షలు లేకుండా నీతివంతమైన రాజకీయాలు చేసినట్టు చెప్పారు. ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేకుండా పార్టీ కోసం పనిచేసినట్లు తెలిపారు. రాజకీయాల్లో శత్రుత్వం మంచిది కాదని, ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఆర్సీపురం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఎమ్మెల్సీ, ప్రొటెం చైర్మన్‌గా బాధ్యతలు నూటికి నూరుశాతం విజయవంతంగా నిర్వర్తించానని భూపాల్‌రెడ్డి తెలిపారు. ఆర్సీపురంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి 1200 మంది విద్యార్థులకు విద్యాబోధన అందించడం మనస్సుకు చాలా తృప్తిని ఇచ్చిందన్నారు.
మూడు పుటల భోజనం దొరకని పేదలకు బువ్వ పెట్టాలనే ఆలోచన ఉన్నదని, దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తన చివరి శ్వాస వరకు పేదలకు సేవచేస్తానని ఆయన వెల్లడించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు భూపాల్‌రెడ్డికి శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమార్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, సోమిరెడ్డి, బాల్‌రెడ్డి, అంజయ్య, వెంకటేశంగౌడ్, కుమార్‌గౌడ్, రాములుగౌడ్, రవీందర్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, నర్సింహ, పరమేశ్, అజీముద్దీన్, వెంకట్‌రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.