సిద్దిపేట, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పత్తి పంట సాగు చేయకున్నా చేసినట్లు ఏఈవోల సంతకాలను ఫోర్జరీ చేసి, దళారులతో కుమ్మక్కై వ్యాపారుల పేరు మీద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి పత్తి ధ్రువీకరణ పత్రాలు రాసిచ్చిన హుస్నాబాద్ మండల వ్యవసాయాధికారి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. సీసీఐ మార్కెటింగ్ అధికారులు, మండల వ్యవసాయ అధికారి దళారులతో చేయి కలిపి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. పత్తి కొనుగోలు వెనుక లక్షల రూపాయల అక్రమాలు జరిగాయి. ఈ విషయం జిల్లా స్థాయి అధికారులకు తెలిసిన మౌనంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణంలో ఎవరికి ఎంత వాటాలు ఉన్నాయో ..? అని రైతులు చర్చించుకుంటున్నారు. వివరాలలోకి వెళ్తే… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో గత వానకాలంలో 6వేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేశారు. సాగు వివరాలను ఏఈవోలు వారి క్లస్టర్ వారీగా ఆన్లైన్లో నమోదు చేశారు.
ఇటీవల పత్తి పంట చేతికి రాగా ప్రభుత్వం పత్తి సేకరణకు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సాగుచేసిన పత్తిని విక్రయానికి సీసీఐ కేంద్రానికి రైతులు తీసుకుపోయే ముందు స్థానిక ఏఈవో వద్ద సాగు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుపోవాల్సి ఉంటుంది. రైతు వివరాలను ఆన్లైన్లో చూసి ఏఈవో ధ్రువీకరణ పత్రాన్ని రాసి టోకెన్ ఇస్తాడు. దానిని తీసుకుపోయి సీసీఐ కేంద్రంలో రైతు తమ పత్తి పంటను అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, హుస్నాబాద్ మండల వ్యవసాయాధికారి కాసులకు కక్కుర్తి పడి దళారులతో చేతులు కలిపినట్లు తెలిసింది. అప్పటికే పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులకు పంట సాగుచేసినట్లు ఏఈవోలకు సమాచారం లేకుండానే ధ్రువీకరణ పత్రాలపై ఫోర్జరీ సంతకాలు చేసి ఆయన టోకెన్లు జారీచేశాడు.
సుమారు 300ఎకరాలకు పైగా ఫోర్జరీ సంతకాలు చేసి ధ్రువీకరణ పత్రాలు వ్యాపారులకు రాసిచ్చాడు. ఈ తతంగంలో మార్కెటింగ్‌లో ఉన్న ఇంకో అధికారితో చేతులు కలిపి ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని దళారులతో కలిసి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వ్యాపారులు సీసీఐ కేంద్రంలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రైతుల వద్ద క్వింటాల్‌కు రూ. 6,200 వరకు కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రంలో క్వింటాల్‌కు రూ. 7,500 వరకు అమ్మి సుమారు రూ. 50 లక్షల పైగానే సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
హుస్నాబాద్ మండలానికి చెందిన ఒక నాయకుడు పత్తి కొనుగోలు ధ్రువీకరణ పత్రం కోసం ఇటీవల సంబంధిత ఏఈవోను కలిశారు. తమ గ్రామానికి చెందిన ఒక వ్యాపారికి పత్తి పంట సాగు ధ్రువీకరణ పత్రం రాసివ్వాలని అతను అడిగారు. దీంతో ఆ రైతు వివరాలను ఆన్లైన్లో చూస్తే పత్తి పంట సాగు చేసినట్లు వివరాలు లేవు. ఒకవేళ ఆన్లైన్లో రైతు వివరాలు లేకపోతే ఫీల్డ్‌కు వెళ్లి ఫిజికల్‌గా పంట సాగు చేశారా? లేదా? అని ధ్రువీకరించి ఈ రైతుకు టోకెన్ ఇవ్వాలి. కానీ, ఆ నాయకుడు తీసుకువచ్చిన వ్యాపారి పేరు మీద ఆన్‌లైన్‌లోగానీ, ఫిజికల్‌గా గానీ పత్తి పంట సాగుచేసినట్లు లేదు. పంట వేయలేదు కాబట్టి తాను రాసివ్వనని ఏఈవో సదరు నాయకుడికి సమాధానం చెప్పారు. దీంతో మీరు ఇదే గ్రామంలో పత్తి పంట సాగుచేయని వారికి సైతం రాసిచ్చారని, వారికి రాసిచ్చినప్పుడు ఇతనికి ఎందుకు రాసివ్వవని, తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించాడు. దీంతో స్పందించిన ఏఈవో తాను ఎవరికి అలా రాసివ్వలేదని, ఆధారాలు ఉంటే చూపించాలని అడిగారు. వెంటనే సదరు నాయకుడు ఆయన వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాన్ని చూపించడంతో ఏఈవో అవాక్కయ్యాడు.
ఇది ఫోర్జరీ సంతకం అని తెలుసుకొని మిగతా ఏఈవోలకు సమాచారం ఇచ్చాడు. ఇలా ఒక క్లస్టరే కాకుండా హుస్నాబాద్ మండలంలోని అన్ని క్లస్టర్లలో ఈ ఫోర్జరీ సంతకాలు వెలుగుచూశాయి. అప్పటికే సీసీఐ వాళ్లతో మాట్లాడుకొని ముందే తెచ్చుకున్న టోకెన్ బుక్‌లో హుస్నాబాద్ మండల వ్యవసాయాధికారి తన కింది స్థాయి అధికారుల (ఏఈవోలు) సంతకాలు ఫోర్జరీ చేసి వ్యాపారులకు టోకెన్ ఇచ్చినట్లు బయటపడింది. తాము చేయని తప్పుకు తమను బలిచేశావంటూ మండల ఏఈవోలు ఏవోను నిలదీశారు.
ఫోర్జరీ చేసిన మాట వాస్తవమేనని, ఒక 30 మంది వరకు ధ్రువీకరణ పత్రాలను రాసిచ్చానని, ఏం జరిగినా తానే బాధ్యుడిని అంటూ ఏఈవోలకు ఏవో లెటర్ రాసిచ్చారని సమాచారం. ఇదే విషయాన్ని సైతం ఏఈవోలు వాళ్ల పైస్థాయి అధికారులైన ఏడీఏకు, జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంపై జిల్లాస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.