చౌటకూర్, మార్చి 14: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ఐదు గ్రామాలను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం 68 జీవో జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో పుల్కల్ మండలం నుంచి 2020లో చౌటకూర్ మండలాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన చౌటకూర్ మండలంలోని శివంపేట, వెండికోలు, వెంకటకిష్టాపూర్, లింగంపల్లి, కోర్పోల్ గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఆయా గ్రామాల శివారు భూముల గుండా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి బీజం పడటంతో అందుకనుగుణంగా హెచ్ఎండీఏ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. రీజినల్ రింగ్ రోడ్డు ప్రారంభానికి ముందే హెచ్ఎండీఏ పరిధిని ప్రభుత్వం విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరందుకోనున్నది.
ఇప్పటికే ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. తాజాగా ప్రభుత్వ ప్రకటనతో భూమి ధర మరింతగా పెరగనున్నది. చౌటకూర్ మండలం మీదుగా సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 నాలుగు లైన్ల జాతీయ రహదారి ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రైవేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇప్పటికే ఓఆర్ఆర్ చుట్టూ బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు కొనసాగుతుండగా, భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ చుట్టూ పెద్దఎత్తున నిర్మాణాలు జరగనున్నాయి. ఇప్పటికే ఎకరం భూమి ధర రూ.కోటిన్నర నుంచి మూడు కోట్ల వరకు పలుకుతున్నది. భవిషత్తులో ఆ ధర మరింత రెట్టింపయ్యే అవకాశాలు లేకపోలేదు.