శివ్వంపేట, ఫిబ్రవరి 28: మెదక్ జిల్లా శివ్వంపేటలో బగలాముఖి శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవం బుధవారం అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ, లక్ష హరిద్రార్చన, 108 మంది సువాసినులతో అమ్మవారికి పసుపార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన లలితా త్రిపుర సుందరీదేవి పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతిస్వామి భక్తులకు ప్రవచనాలు బోధించారు. ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన ఆలయంలో హైదరాబాద్ శ్రీరామదాసు భరతనాట్య అకాడమీకి చెందిన డాక్టర్ ప్రియాంక భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నది. సాయంత్రం ఆలయం చుట్టూ పల్లకీసేవ నిర్వహించారు. శక్తిపీఠం ట్రస్టు సభ్యుడు, జడ్పీటీసీ పబ్బమహేశ్ గుప్తా ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యార్ధం షామియానాలు, టెంట్లు, తాగునీటి సౌకర్యం, పూల ద్వారాలు ఏర్పాటు చేశారు. దుబాయ్‌కు చెందిన రమ్య అయ్యప్ప దంపతులు అమ్మవారికి రూ.1.50 లక్షల విలువ చేసే పల్లకీసేవను బహూకరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చాగండ్ల నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు మొదటిరోజు అన్నదానం చేశారు.
ఉత్సవాల్లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్‌గౌడ్, కాంగ్రెస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పబ్బరమేశ్ గుప్తా, చాగండ్ల బల్వేందర్నాథ్, సింగాయపల్లి గోపి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, తూము కృష్ణారావు, జ్ఞానేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాస్‌చారి దంపతులు, వంజరి కొండల్, పోచాగౌడ్ పాల్గొన్నారు. సంతోషంగా ఉంది: వెంకటేశ్వరశర్మ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ.. అనతి కాలంలోనే బగలాముఖి శక్తిపీఠానికి గొప్ప గుర్తింపు రావడం శుభ సూచికమని, అంతా అమ్మవారి కృప అన్నారు. అందరిలో భక్తిభావం మరింత పెరగాలని, బగలాముఖి అమ్మవారిని నిత్యం స్మరించుకుంటే అంతా మంచి జరుగుతుందన్నారు. రెండోరోజు గురువారం మరిన్ని ముఖ్యమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు హాజరుకావాలని కోరారు.