పటాన్చెరు, ఏప్రిల్ 13: ఆసియా ఖండంలోనే అత్యధిక పరిశ్రమలున్న పటాన్చెరు ప్రాంతంలో అగ్నిప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇక్కడి పరిశ్రమల్లో ఆగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు ఒకటే అగ్నిమాపక వాహనం ఉండడంతో అత్యవసర వేళల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రపురం, జిన్నారం, గుమ్మడిదల మండలాలు ఉన్నా యి. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, ఖాజిపల్లి, గడిపోతారం, జిన్నారం, గుమ్మడిదల, సూల్తాన్పూర్ ప్రాంతంలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పేందుకు పటాన్చెరులో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసింది.
జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాలు పటాన్చెరుకు సుమా రు 30 కిల్లోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినప్పుడు పటాన్చెరు, నర్సాపూర్ నుంచి అగ్నిమాపక యంత్రాలు వెళ్లేసరికి జరగాల్సిన నష్టం జరుగుతున్నది. వేసవిలో రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి.
పాశమైలారంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భారీ పరిశ్రమల యాజమాన్యాలు కొన్ని సొంతంగా అగ్నిమాపక వాహనాలు సమకూర్చుకున్నాయి. కానీ, చిన్నచిన్న పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పటాన్చెరు నుంచి వచ్చే ఒక్క అగ్నిమాపక వాహనమే ఉండడంతో ఆస్తి,ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతున్నాయి. భారీ ప్రమాదాలు జరిగిన సమయంలో బీహెచ్ఈఎల్, నర్సాపూర్, జీడిమెట్ల నుంచి అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చిన సంఘటనలు ఉన్నాయి.
పటాన్చెరులో ఆగ్నిమాపక కేంద్రం..
పటాన్చెరులోని అగ్నిమాపక కేంద్రంలో ఉన్న ఒక్క అగ్నిమాపక వాహనం ద్వారా పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల మండలాలకు సేవలు అందిస్తున్నారు. వేలాది పరిశ్రమలకు నెలవైన పటాన్చెరులో పారిశ్రామిక ప్రాంతంలో ఒక్క అగ్నిమాపక వాహనం ద్వారా సేవలు సరిపోవడం లేదు. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం, గడిపోతారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం ప్రాంతంలోని పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రసాయన పరిశ్రమల్లో వేసవి కాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టం జరుగుతున్నది. పరిశ్రమల్లో రియాక్టర్లు, బాయిలర్లు పేలడం, పొగగొట్టాలు, ఇతర యంత్రాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే వెంటనే అప్రమత్తం చేసే సాంకేతికత ఏర్పాటు చేయడం లేదు. వేసవిలో ఎక్కువగా పరిశ్రమల్లో గ్యాస్ లీకేజీ ఆస్కారం ఉండడంతో ఎప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
పరిశ్రమల్లో కార్మికులు పనిచేసే ప్రాంతంలో తగిన భద్రత చర్యలు తీసుకోక పోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. పరిశ్రమల్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నాయి. వేసవిలో ఎండతో పాటు పరిశ్రమల్లో ఉష్ణ్ణోగ్రతలు పెరిగి రియాక్టర్లు, బాయిలర్లు పేలిపోయి ప్రమాదాలు జరుగుతుంటాయి.
ప్రమాదాలు జరిగిన సమయంలో అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించినా, పటాన్చెరు నుంచి ఒక్క అగ్నిమాపక వాహనం వచ్చినా పెద్దగా ఉపయోగం లేకుండా పోతున్నది. భారీగా ఆస్తి నష్టం జరుగుతున్నది. జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో మరో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.