పటాన్చెరు రూరల్, నవంబర్ 6 : అగ్నిప్రమాద సైరన్ ఒక్కసారిగా మోగడంతో అపియోరియా ఫార్మా పరిశ్రమలో అప్రమత్తత. కార్మికులందరు హుటాహుటిన అసెంబ్లీ పాయింట్‌కు సురక్షితంగా చేరుకున్నారు. బాధ్యత, నైపుణ్యం ఉన్న ఫైర్‌ఫైటింగ్, సేప్టీ బృందాలు తక్షణం కదం తొక్కాయి. అగ్నిని ఆపేందుకు ఫైర్‌ఫైటింగ్ పరికరాలతో సంసిద్ధమయ్యాయి. కెమికల్స్, సాల్వేంట్స్ మంటలను అర్పే ఫోమ్‌ను, నీటిని భారీగా వెదజల్లి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. వారికి మద్దతుగా ఫైరింజన్లు వచ్చాయి. ఫైర్ సేప్టీ బృందాలు అత్యవసరంగా నీటితో మంటలను అర్పే ప్రయత్నం చేశాయి.
చివరికి అందరూ విజయవంతంగా మంటలను అర్పేశారు. ఇదంతా జిల్లా అధికారులు, పరిశ్రమ యాజమాన్యం ఏర్పాటు చేసిన మాక్‌డ్రిల్‌లో భాగం. సిగాచి ప్రమాదంలాంటిది ఇక మీదట సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, వివిధ శాఖల సమన్వయంకోసం గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం అపియోరియా పరిశ్రమలో ఏర్పాటు చేసిన మాక్‌డ్రిల్ అధికారుల్లో, కార్మికుల్లో, స్థానికుల్లో అవగాహన తెచ్చేందుకు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖ, రెవెన్యూశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్డీఆర్ఎఫ్), వివిధ శాఖలతో మాక్‌డ్రిల్‌ను ఏర్పాటు చేశారు.
నిబంధనలు పాటించాలి
– సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
ఈ సందర్భంగా మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న కార్మికులను, పరిశ్రమ యాజమాన్యాన్ని, అధికారులను, ఫైర్‌ఫైటింగ్ సిబ్బందిని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాక్‌డ్రిల్ అనుభవంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలో తెలుస్తుందన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరూ తప్పక భద్రతా నియమాలను పాటించాలన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే వెంటనే కంపెనీ సేప్టీ బృందాల దృష్టికి తేవాలని సూచించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి సంబంధిత పరిశ్రమలో మంటలు ఆర్పేందుకు, కార్మికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. మాక్‌డ్రిల్ ద్వారా అన్ని శాఖల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని తెలిపారు. మాక్‌డ్రిల్‌లో పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్ విజయ్‌కృష్ణ, లాలూనాయక్, పరిశ్రమల శాఖ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు, ఫైర్ సేప్టీ బృందాలు పాల్గొన్నాయి.