జూబ్లీహిల్స్,నవంబర్ 6: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గుండెకాయలాంటి యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, వెంకటగిరిలు గులాబీమయమయ్యాయి. గురువారం బీఆర్ఎస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బీఆర్ఎస్ మెగా ర్యాలీ విజయోత్సాహాన్ని తలపించింది. యూసుఫ్‌గూడ బస్తీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయం నుంచి చెక్‌పోస్ట్, మెట్రో స్టేషన్, కృష్ణానగర్, జామా మసీద్ మహ్మదీ, వెంకటగిరి, గాయత్రీ హిల్స్ రోడ్, వెంకటగిరి వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్, సాయి నిలయం, జూబ్లీహిల్స్ క్రాస్‌రోడ్స్, ఇందిరానగర్ మీదుగా గ్రీన్ బావర్చి వరకు రెండున్నర గంటలపాటు ర్యాలీ నిర్వహించారు.
మాగంటి కుమార్తెలు మాగంటి అక్షర, దిశిర పాల్గొన్న ఈ ర్యాలీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, తీగుళ్ల పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రచార రథంపైనుంచి ప్రదర్శించిన ఆటాపాటలు గులాబీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని నింపింది. బుల్డోజర్ కావాలా.. కారు కావాలా..? శాంతి పాలన కావాలా.. రౌడీ రాజ్యం కావాలా..? స్కూటీల పంపిణీ ఏమైంది..? నవ వధువుకు తులం బంగారం ఎక్కడ..? గృహిణులకు రూ.2,500లు ఎక్కడ..?, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ పెంపు ఎక్కడ..? అంటూ ప్లకార్డులతో కాంగ్రెస్ సర్కారును నిలదీస్తూ మహిళలు, యువత ఉరిమే ఉత్సాహంతో తీసిన ర్యాలీ విజయోత్సవ వేడుకలను తలపించింది. రేవంత్ రెడ్డి విధ్వంస పాలనను ఓటర్లకు వివరిస్తూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించే కరపత్రాలను పంచుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థికే ఓటువేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం అప్పుడే ఖరారైపోయిందని.. భారీ మెజారిటీ కోసమే అందరూ సమిష్టి కృషి చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శుభప్రద పటేల్, సతీశ్ రెడ్డి, ఆశీశ్ కుమార్ యాదవ్, లింగాల కమల్ రాజ్, లక్ష్మణ్ రావు, జీవీ రామకృష్ణారావు, చల్లా హరిశంకర్, బండారు రాజ్‌కుమార్ పటేల్, రాఘవేందర్, ఆజం అలీ, పుస్తె శ్రీకాంత్, కూన నరేందర్ రెడ్డి, పవన్ రెడ్డి, షబ్బీర్, ఫహీం, గొల్ల నర్సింగ్‌రావు యాదవ్, గుండ్లపల్లి శేషగిరిరావు, కోట్లవినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.