Medak | హైదరాబాద్ : ఇద్దరి మధ్య నెలకొన్న భూవివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంట కోసేందుకు సిద్ధమైన రైతును అడ్డుకునేందుకు ప్రత్యర్థి డమ్మీ తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పరిధిలోని హవేలిఘన్‌పూర్ గ్రామ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ఎల్లం అనే రైతు తన వరి పంటను కొసేందుకు సిద్ధమయ్యాడు. అయితే హైదరాబాద్‌కు చెందిన హరినాథ్ అనే వ్యక్తి తన అనుచరులతో ఆ పొలం వద్దకు చేరుకున్నాడు. పంట కోసేందుకు వీల్లేదని, ఈ భూమి తనదని డమ్మీ తుపాకీతో ఎల్లంను బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఎల్లం పోలీసులకు సమాచారం అందించాడు.
పొలం వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హరినాథ్ వద్ద ఉన్న డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూవివాదం కోర్టులో ఉందని, వరి పంటను కోసేందుకు ఎల్లం కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.