సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : బోరబండ కాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు భగ్గుమన్నది. గురువారం కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సైట్-1లోని అక్బరీ మసీద్‌లో స్థానిక మసీద్ కమిటీలతో ఎన్నికల సమావేశం నిర్వహించారు. తోయిద్ మజీద్ తరపున పాల్గొనేందుకు వచ్చిన బోరబండ కాంగ్రెస్ నేత షేక్ షరీఫ్ మసీద్‌లోకి ప్రవేశిస్తుండగా కార్పొరేటర్ బాబా అతడిని అడ్డుకున్నాడు. ‘ఆగు.. నిన్నెవరు రమ్మన్నారు?, ఎందుకు వచ్చావ్’ అని షరీఫ్‌ను బయటకు తరిమేయాలంటూ సంగారెడ్డి నుంచి పిలిపించుకున్న అనుచరులను ఆదేశించాడు. అందులో రౌడీషీటర్లు కూడా ఉన్నారని ఆరోపణలున్నాయి.
స్థానికుడిని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడినైన తనను మసీద్‌లోకి ఎందుకు రావద్దంటున్నావో చెప్పాలని షరీఫ్.. బాబాను ప్రశ్నించగా అరేయ్.. అతడిని బయటకు తోసేయండి ఎక్కువ మాట్లాడుతున్నడు అంటూ బాబా తన అనుచరులతో కలిసి షరీఫ్‌ను బయటకు తోసేసే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన ముస్లిం మత పెద్దలు కలుగజేసుకుని బాబాకు సర్ది చెప్పినా వారి మాటలను ఖాతరు చేయండా ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడి అవమానించాడని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మసీద్‌లో జరిగిన ఘటనపై షరీఫ్ బోరబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి రౌడీలతో తనపై దాడికి యత్నించాడని, ఫసియుద్దీన్‌తో తనకు ప్రాణహాని ఉన్నదని షరీఫ్ భయాందోళనకు గురవుతున్నాడు.