హుస్నాబాద్, డిసెంబర్ 22 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఫైరింజన్‌కు నీడ లేకుండా పోయింది… అగ్ని ప్రమాదం జరిగిందంటే శరవేగంతో వెళ్లి మంటలార్పి ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేసే ఫైరింజన్‌కు రక్షణ లేదు. వ్యవసాయ మార్కెట్ యార్డులో దుమ్మూ ధూళితో నిండిపోయి తరచూ రిపేర్లకు వస్తూ సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకోలేని స్థితిలో ప్రస్తుతం ఫైరింజన్ కొట్టుమిట్టాడుతోంది…ఫైరింజన్కే కాకుండా ఫైర్ అధికారులు, సిబ్బందికి కూడా కనీస సౌకర్యాలు లేక ఏండ్ల తరబడి ఒకే గదిలో ఈ అగ్నిమాపక కార్యాలయం కొనసాగుతోంది… దీనికి సరిపడా అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ వారికి తగిన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం ఈ కార్యాలయం దుస్థితికి నిదర్శనం… అదే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు సేవాకేంద్రంలో కొనసాగుతున్న అగ్నిమాపక (ఫైర్ స్టేషన్) కార్యాలయం.
హుస్నాబాద్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలతో పాటు ఇతర ప్రమాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో వాటిని నివారించేందుకు అప్పటి ప్రభుత్వం 2010 మార్చి 22వ తేదీన కాంట్రాక్టు పద్ధతిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతు సేవా కేంద్రం భవనంలో దీనిని ఏర్పాటు చేశారు. 2017 ఏప్రిల్ వరకు కాంట్రాక్టు పద్ధతి కొనసాగింది. అనంతరం రెగ్యులర్ సిబ్బందిని నియమించినప్పటికీ కాంట్రాక్ట్ ఫైరింజనే నడిచింది. 2023 జనవరి 5వ తేదీన పూర్తి స్థాయి అధికారిక ఫైర్ స్టేషన్‌గా మార్చుతూ అప్పటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందుకు మార్కెట్ యార్డులోని 10గుంటల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1.18కోట్లను సైతం కేటాయించారు. టెండర్ సకాలంలో పూర్తి కాకపోవడం, ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో భవన నిర్మాణం ఆగిపోయింది. కొత్త సర్కారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా దీని గురించి పట్టించుకునే వారు లేరు. స్వయానా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్నాబాద్‌లో అరకొర వసతులతో ఫైర్‌స్టేషన్ ఉండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక గదిలో ఫైర్ అధికారితో పాటు సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది.
హుస్నాబాద్ ఫైర్ స్టేషన్‌కు ఫూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ కనీస వసతులు మాత్రం లేవు. ఫైర్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు లీడిండ్ ఫైర్మన్లు, ముగ్గురు డ్రైవర్ ఆపరేటర్లు, ఐదుగురు ఫైర్మన్లు, ఏడుగురు హోమ్‌గార్డులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఒకే గదిలో విధులు నిర్వహించాల్సి వస్తోంది. రెండు టేబుళ్లు, నాలుగు కుర్చీలు తప్పా ఇతర ఫర్నిచర్ ఇక్కడ కనబడదు. ఫైరింజన్ పార్కు చేసేందుకు కూడా కనీసం షెడ్డు కూడా లేదు. ఇటీవల లాండ్రీషాపులో మంటలు లేవగా ఆర్పేందుకు వెళ్లిన ఫైరింజన్ మధ్యలోనే సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది. కొత్త భవనం పూర్తయ్యే వరకు మరో భవనం కేటాయించాలని ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను పలుమార్లు కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని అధికారులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఫైరింజన్ తరచూ రిపేరుకు వస్తుండటం, పాత మోడల్ కావడంతో కొత్త వాహనం మంజూరు కోసం విన్నవించగా ఇటీవల మంజూరైనట్లు అధికారులు తెలిపారు. కొత్త వాహనం వస్తే ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కావడం లేదని తలపట్టుకుంటున్నారు. ఫైర్ కార్యాలయం భవన నిర్మాణం గురించి పలుమార్లు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు కానీ స్పందన లేదు. ప్రస్తుతం భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం సరిపోదని కనీసం ఎకరం స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులకు విన్నంచినా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి హుస్నాబాద్ ఫైర్ స్టేషన్‌ను సకల సౌకర్యాలతో నిర్మాణం జరిగేలా స్థలం, నిధులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఫైర్ కార్యాలయం అసౌకర్యాలతో ఉన్నది. అధికారులు, సిబ్బంది మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. కొత్త భవన నిర్మాణం త్వరగా ప్రారంభించడంతో పాటు, అప్పటి వరకు మరో భవనాన్ని కేటాయించాలని విన్నవించాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఫైర్‌స్టేషన్‌కు 30గుంటల స్థలం కావాలని ఆర్డీవోకు సైతం వినతి పత్రం ఇచ్చాం. కొత్త ఫైరింజన్ వస్తోంది. దానిని ఎక్కడ ఉంచాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఖాళీ చేయాలని రైతు సేవాకేంద్రం పాలకవర్గం వారు ఒత్తిడి తెస్తున్నారు. ఫైర్ స్టేషన్‌కు సరైన సౌకర్యాలతో కూడిన భవనం, స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాం.