Sugar Cane Crop | పుల్కల్,పిబ్రవరి 9: పుల్కల్ మండలం ముద్దాయిపేట గ్రామ శివారులో ఆదివారం 14 ఎకరాల్లో చెరుకుతోట దగ్ధమైంది. తనకు గిట్టని వారే తగలపెట్టి ఉంటారని పెద్దారెడ్డిపేట గ్రామ రైతు కుమ్మరి లింగయ్య వాపోయారు. తన చెరుకు తోట తగల పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ముద్దాయిపేట శివారులోని 299,300,301 సర్వే నంబర్ల లో చెరుకు పంట సాగు చేశాడు. చెరుకు పంట కోతకు వచ్చినా లేబర్ కొరత ఉండటంతో చేసేదేమి లేక అలాగే ఉండిపోయాడు.
చెరుకు కోయడానికి వచ్చేందుకు లేబర్తో ఒప్పందం కుదుర్చుకుని ఏడుపాయల వన దుర్గాభవాని మాత దర్శించు కుని వద్దామని వెళ్లానని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతలోనే చెరుకు తోటలో నుంచి అధికంగా మంటలు వ్యాపించాయని అటుగా వెళ్ళిన కొందరు వ్యక్తులు తనకు సమాచారం అందించారన్నారు. వెంటనే జోగిపేట ఫైర్ ఇంజన్ సహాయం కోసం సమాచారం అందించినా అప్పటికే తోటంత పూర్తిగా దగ్దం అయింది. తనకు సుమారుగా రూ.8 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.