హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ఎంతో విజయవంతమయ్యాయని, వాటి తరహాలో అన్ని జిల్లాకేంద్రాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట 16 వార్డులో బుధవారం బస్తీ దవాఖానను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆదివారం సైతం సేవలందించేలా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.158 రకాల టెస్టులు ఉచితంగా చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించేలా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భిణులు జాగ్రత్తలు తీసుకుని పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతూ కరపత్రికను అందించే కార్యక్రమానికి ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో కంటివెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
– సిద్దిపేట, ఫిబ్రవరి 15
సిద్దిపేట, ఫిబ్రవరి 15 : బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. పట్టణంలోని 16వ వార్డులో బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సుతో కలిసి బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ సూచనతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేటలోని ఇందిరమ్మ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పట్ట పరిశ్రమ భవనాన్ని స్థానికుల కోసం బస్తీ దవాఖానగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. బస్తీల్లో ఉండే పేదలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. బస్తీదవాఖాన ఉదయం 9 నుంచి సాయం త్రం 4 వరకు పనిచేస్తున్నదని తెలిపారు.
బస్తీ దవాఖానలు ఆదివారం పనిచేస్తాయి..
బస్తీదవాఖానల్లో 158 రకాల మందులు, 133 రకాల టెస్ట్టులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో 350కి పైగా బస్తీ దవాఖానలు ప్రారంభించి, ఇప్పటి వరకు 2 కోట్ల మందికి వైద్యసేవలు అందించామన్నారు. కోటి ఐదు వేల మందికి ఉచితంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు చేశామన్నారు. హైదరాబాద్‌లో విజయవంతం కావడం తో సీఎం కేసీఆర్ సూచన మేరకు జిల్లాకేంద్రాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట పట్టణంలో నలుదిక్కులా నాలుగు బస్తీదవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. 5వ దవాఖానను పొన్నాల హరీశ్నగర్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బస్తీదవాఖానలు ఆదివారం సైతం ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజ లు ఎన్సీడీ పరీక్షలు చేసుకొని అందుకు తగ్గట్టుగా మందులు వాడాలన్నారు. క్రమం తప్పకుండా షుగర్, బీపీ మందులు వాడి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ పొందాలని సూచించారు.
పేదల కోసమే బస్తీ దవాఖానల ఏర్పాటు
జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. బస్తీలోని పేదలు సద్వినియోగం చేసుకొని, ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, 1వ వార్డు కౌన్సిలర్ విజయేందర్‌రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాలసాయిరాం, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సత్తయ్య, సయ్యద్, సాకి ఆనంద్‌తోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేట జనరల్ దవాఖాన సేవలు వినియోగించుకోవాలి
ప్రైవేట్ దవాఖానలతో పోటీపడేలా సిద్దిపేట జనరల్ దవాఖానను తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. డయాలసిస్ సేవలు అం దుబాటులోకి తెచ్చామని, రానున్న రోజుల్లో గుండె ఆపరేషన్ల కోసం క్యాత్‌ల్యాబ్, క్యాన్స ర్ పేషెంట్ల కోసం రెడియోథెరపీ, కిమోథెరపీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అవసాన దశలో ఉన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతల కోసం అమ్మఒడి వాహనం, అవసాన దశలో ఉన్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఆలన వాహనాన్ని, అత్యవసర వైద్యసేవల కోసం 108 వాహనాన్ని, దవాఖానలో చనిపోతే వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఉచితంగా పరమపద వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు.
గర్భిణులకు అవసరమైన టిఫా, ఆల్ట్రాసౌం డ్, సీటీ స్కాన్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే లింగారెడ్డిపల్లిలో పల్లె దవాఖాన ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత సేవ అందిస్తామన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రభుత్వం అందజేస్తున్న వైద్యసేవలు ఏమిటి అనే అంశాలు వివరిస్తూ ఏర్పాటు చేసిన ఆహ్వాన పత్రికను మంత్రి ఆవిష్కరించారు. అంతకు ముందు ఎన్సీడీ కిట్లను వైద్యులకు అందజేశారు.
మంత్రి సహకారంతో దవాఖానల అభివృద్ధి
కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ మంత్రి హరీశ్‌రావు సహకారం తో జిల్లాలో రూ. 10 కోట్లతో 76 కొత్త హెల్త్ సబ్‌సెంటర్లు, 90 హెల్త్ సబ్‌సెంటర్లకు మరమ్మతులు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బస్తీ దవాఖానలు సిద్దిపేటలో 4, గజ్వేల్‌లో 2, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో 1 చొప్పున ఏర్పాటు చేశామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో రోజుకు ఏడున్నర వేల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, లక్షా 35 వేల మందికి ఇప్పటి వరకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. 21 వేల మంది కంటి అద్దాలు, 3వేల మంది ప్రిస్కిప్షన్ అద్దాలు అందజేశామన్నారు.