సంగారెడ్డి, జనవరి 30(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 2293 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి రాజకీయపార్టీలు అందజేసే బీ-ఫామ్లపైనే నెలకొం ది. రాజకీయపార్టీల్లో టికెట్లు లభించని అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యే లు, నియోజకవర్గ ఇన్చార్జిలను కలిసి బీ-ఫామ్‌లను సాధించే పనిలో నిమగ్నమయ్యారు.
మరోవైపు ప్రధాన రాజకీయపార్టీలు రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించడంపై దృష్టిపెట్టాయి. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన తమ పార్టీ నాయకులను నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేలా ప్రధాన రాజకీయపార్టీలు బుజ్జిగింపులు మొదలుపెట్టాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారో అన్న ఉత్కం ఠ నెలకొంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో అత్యధికంగా 394 మం ది అభ్యర్థులు నామినేసన్లు దాఖలు చేశారు. కోహీర్‌లో 126 మంది నామినేషన్లు వేశారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రాత్రి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 769మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్కోవార్డు నుంచి ముగ్గురు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీజేపీ నుంచి 390, ఎంఐఎం నుంచి 62 మంది, బీఎస్పీ నుంచి 11 మంది, సీపీఎం నుంచి తొమ్మిది మంది, జనసేన నుంచి నలుగురు, ఆప్ పార్టీ తరపున ముగ్గురు, పార్వర్డ్‌బ్లాక్ నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి 31 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా 336మంది నామినేషన్లు దాఖలు చేశారు.