పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు
సంగారెడ్డి జిల్లాలో 8 గ్రామాల ఎంపిక
వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌రావు
ఎల్లారం, నాగులపల్లిలో లాంఛనంగా ప్రారంభం
సదాశివపేట, జూన్ 7 : భూ కమతాల మార్కింగ్ పంటల నమోదుకే అని వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారం, నాగులపల్లి గ్రామాల్లో వ్యవసాయక్షేత్ర విభాగాల భావన- నిర్మాణ ప్రాజెక్టును లాంఛనంగా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. భూ కమతాల మార్కింగ్ పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 గ్రామాలు ఎంపిక చేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 8 గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు.
గూగుల్ వారి సహకారంతో పంటల నమోదు కార్యక్రమంలో లోటుపాట్లను అధిగమిస్తామన్నారు. పంటల నమోదు కోసం సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా క్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ ప్రాజెక్టును తొలిసారిగా క్షేత్రస్థాయిలో నిర్వహించామన్నారు. 17 గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారులకు భూకమతాలను ఏ విధంగా గూగుల్ సంస్థ వారి సహకారంతో విభజించి మార్కింగ్ చేయాలో వివరించారు. పంటల నమోదులో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా భూ కమతాలను విభజించి మార్కింగ్ చేయవచ్చనేది గ్రౌండ్యాప్ ద్వారా వివరించారు. భూ కమతాలు, వ్యవసాయక్షేత్రాలను గూగుల్ ఎర్త్ మ్యాప్‌తో అనుసంధానం చేయడంతో ఆయా క్షేత్రాల్లో ఏ పంటలు వేస్తున్నారు. పంటలపై ఉన్న చీడపీడలు, పంట ఎంత దిగుబడి వస్తుంది అన్న పూర్తి విషయాలు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
కలెక్టరేట్లో అధికారులకు అవగాహన
కలెక్టరేట్లో వ్యవసాయక్షేత్ర విభాగాల భావన-నిర్ధారణ ప్రాజెక్టుపై కలెక్టర్ హనుమంతురావుతో కలిసి అధికారులు, ఏఈవోలకు వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌రావు అవగాహన కల్పించారు. అనంతరం భూ కమతాలను ఆన్లైన్ చేయడంలో వచ్చే సమస్యలను అధిగమించడంపై గూగుల్ సంస్థ వారు నివృత్తి చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతు, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, గూగుల్ సిబ్బంది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, జిల్లా వ్యవసాయశాఖ జేడీ నరసింహారావు, ఏడీఏలు, ఏఈవోలు పాల్గొన్నారు.