హుస్నాబాద్, మే 19: రసాయనాలు, ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూమిలోని సారం పూర్తిగా తగ్గిపోయి పంటల దిగుబడులు పడిపోతున్నాయి. రసాయనాల వల్ల రైతులు పండించిన పంటలోనూ నాణ్యత లేకపోవడం, తద్వారా ఇవి తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడటం తరచూ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు సేంద్రియ, సహజసిద్ధమైన పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగించి పంటలు పండించాలని సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువుల్లో ముఖ్యం గా వర్మీ కంపోస్టు, పశువుల పేడను వినియోగిస్తారు. వీటి తయారీకి అధిక ఖర్చయ్యే అవకాశం ఉన్నందున పచ్చిరొట్ట ఎరువులు అతితక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు చెప్తున్నారు.
వానకాలం తొలకరి జల్లులు కురవగానే పచ్చిరొట్ట పైర్లను సాగు చేసినైట్లెతే వానకాలం పంట సాగు చేసుకునేటప్పటికీ ఎరువులు సిద్ధంగా ఉంటాయి. పచ్చిరొట్ట పైర్లలో 16రకాలు ఉంటాయి. ఇందులో జీలుగ, అవిశ, జనుము, వెంపల్లి, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, గోడుచిక్కుడు, అజోల్ల, కానుగ, వేప, ైగ్లెసిడియా, జిల్లేడు, నేల తంగేడు, కొండ మిరుప తదితర రకాలు ఉన్నాయి. వరితో పాటు ఏ పంట సాగు చేసినా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు అవసరం. ఇవి పచ్చిరొట్ట సాగు చేయడం ద్వారా పుష్కలంగా సమకూర్చుకునే అవకాశం ఉంది.
జీలుగ పంటను చౌడు, వరి పండించే భూముల్లో సాగు చేసినైట్లెతే మంచి ఫలితాలు ఉంటాయి. ఎకరానికి 20కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మొక్కలు పెరిగి పూతదశకు వచ్చే సరికి 6 నుంచి 8టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని అదేపొలంలో కలియదున్ని మురగపెట్టినైట్లెతే 30 నుంచి 32కిలోల యూరియా లభిస్తుంది. ఈ పంటను సాగుచేయడం వల్ల పొలంలో వేయాల్సిన యూరియా కన్నా 30 నుంచి 32కిలోలు తక్కువగా వేసినా సరిపోతుంది. వీటిద్వారా 3.5శాతం నత్రజని, 0.6శాతం భాస్వరం, 1.2శాతం పొటాష్ లభిస్తుంది.
జనుము సాగు చేసేందుకు ఒక ఎకరానికి 9నుంచి 14కిలోల విత్తనాలు అవసరం ఉంటాయి. దీని ద్వారా ఎకరానికి 5 నుంచి 6టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. వీటిని పొలంలోనే కలియదున్నితే 24కేజీల యూరియా లభిస్తుంది. ఇందులోనూ 2.3శాతం నత్రజని, 0.5శాతం భాస్వరం, 1.8శాతం పొటాష్ ఉంటాయి.
పెసర, మినుము పచ్చిరొట్టతో ఎకరానికి 15నుంచి 20కిలోల యూరియా వస్తుంది. వరిసాగు చేసే పొలాల్లో వీటిని వేసుకోవడం వల్ల అధిక లాభం ఉంటుంది. భారీగా నత్రజని కూడా లభిస్తుంది. పూతదశకు రాగానే పొలంలోనే దున్ని మురగపెడితే పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. సహజసిద్ధ ఎరువు కావడంతో వరిధాన్యం నాణ్యతగా ఉండటంతోపాటు ఈ పంట ద్వారా వచ్చిన బియ్యం తిన్న ప్రజలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
అవిశ పంటకు ఎకరానికి 16కేజీల విత్తనాలు అవసరమవుతాయి. దీని ద్వారా సుమారు 40 కేజీల నత్రజని ఉత్పత్తి కావడం విశేషం. సెస్బానియం పచ్చిరొట్ట సాగు చేయాలనుకుంటే ఎకరానికి 16కేజీల విత్తనాలు వేసుకోవాలి. ఎకరం పొలానికి 70 కేజీల దాకా నత్రజని లభిస్తుంది.
అలసంద సాగుకు ఎకరానికి 15కేజీల విత్తనాలు అవసరం ఉంటాయి. ఈ మొక్కలను పొలంలో కలియదున్నితే 60 కేజీల వరకు నత్రజని ఉత్పత్తి అవుతుంది. పిల్లిపెసర ఎకరానికి కేవలం 6కేజీల విత్తనాలు సరిపోతాయి. దీని ద్వారా ఏకంగా 40కేజీల నత్రజనిని పొలంలో ఉత్పత్తి చేసుకోవచ్చు.
వేసవిలో పంటలు కోయగానే దుక్కి దున్నుకోవాలి. తొలకరి వర్షాలు పడగానే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవాలి. నీటి వసతి ఉంటే వేసవిలోనే సాగు చేయడం లాభదాయకం. పసుపు, కంది, చెరుకు వంటి పంటల మధ్య కూడా పచ్చిరొట్ట పైర్లను పూతదశంలో కలియదున్నుకోవాలి. పచ్చిరొట్ట పైర్లను సాగు చేసేందుకు ఎక్కువ విత్తనాలు చల్లుకోవాలి. ఎందుకంటే తక్కువ విత్తనాలు చల్లితే మొక్కలు పెరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
జీలుగ, జనుము విత్తనాలను ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచాం. ఇప్పటికే పలు స్టోర్లలో నిల్వ ఉంచాం. జీలుగ విత్తనాలకు కిలో ధర రూ. 93 ఉండగా ఇందులో రూ. 55.80 సబ్సిడీ పోను రైతు రూ. 37.20 చెల్లించాల్సి ఉంటుంది. 30కిలోల బస్తా చొప్పన ప్రస్తుతం విక్రయానికి ఉంచాం. జనుము విత్తనాలు కిలో ధర రూ. 90.50 ఉండగా ఇందులో ప్రభుత్వం రూ. 54.30 సబ్సిడీ ఇస్తుంది. రైతు చెల్లించే ధర రూ. 36.20 మాత్రమే. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకొని పచ్చిరొట్ట సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందాలి. పూర్తి వివరాలకు వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
– పి.మహేశ్, అసిస్టెండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, హుస్నాబాద్