పెద్దశంకరంపేట, జులై04: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపురం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యకు సంబంధించిన కేసును ఒక్కరోజులోనే పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం వెల్లడించారు.
సీఐ చెప్పిన వివరాల ప్రకారం.. కమలాపురం గ్రామానికి చెందిన తోట సుధాకర్ (43) భార్య రెండు సంవత్సరాల క్రితం మరణించింది. అతనికి 13 ఏళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు ఉంది. అయితే కుమారుడు పోలియో బారిన పడి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సుధాకర్.. తాగడానికి డబ్బులు ఇవ్వాలని తన తండ్రి నర్సింహులుతో ప్రతిరోజూ గొడవపడేవాడు. బుధవారం రాత్రి కూడా తనకు రూ.30వేలు ఇవ్వాలని నర్సింహులుతో సుధాకర్ గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోతే తెల్లారేసరికి చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో తన కొడుకుతో ఎప్పటికైనా ప్రాణహాని తప్పదని నర్సింహులు భావించాడు. దీంతో అదే రోజు రాత్రి పడుకుని ఉన్న తన కుమారుడి తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన సుధాకర్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య కేసులో నిందితుడు తోట నర్సింహులు(63)ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ రేణుకారెడ్డి తెలిపారు.