చేర్యాల, నవంబర్ 15: పత్తి మిల్లు తూకంలో తేడాలు వస్తున్నాయంటూ మండలంలోని వీరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ ఇండస్ట్రీస్ వద్ద రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పత్తిని తూకం వేయిస్తే పలుమార్లు వివిధ రకాలుగా తేడాలు వచ్చాయని,కొన్ని రోజులుగా మిల్లులో ఇదే తంతు కొనసాగుతున్నదని, దీంతో నష్టపోయామని రైతులు ఆరోపించారు.
మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన బండారు సతీశ్, ఆకునూరి శేఖర్ తీసుకుపోయిన పత్తి తూకంలో తేడా రావడంతో వారికి తోడుగా ఇతర ప్రాంతాల రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, కాటన్ పర్చేజింగ్ ఆఫీసర్ అమిత్పాటిల్ మిల్లును సందర్శించి రైతులతో మాట్లాడి తూకం వేసే యంత్రాన్ని పరిశీలించారు. సాంకేతిక కారణాలతో తూకంలో తేడా వచ్చిందని, రెండు రోజుల పాటు మిల్లులో కొనుగోలు నిలిపివేస్తున్నట్లు డీఎంవో తెలిపారు.