అక్కన్నపేట, నవంబర్ 10: తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి సర్వేనంబర్ 312లోని రైతులు స్పష్టం చేశారు. ఆదివారం రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు మోఖాపై వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని తమకు సమాచారం ఇవ్వకుండా, తమ భూముల్లో సర్వే ఎందుకు చేస్తున్నారని రెవెన్యూ అధికారులను నిలదీసి వెనక్కి పంపించారు.
భూముల మీద ఆధారపడి జీవిస్తున్నామని, భూములను లాక్కోవడం సరికాదన్నారు. సర్వేల పేరుతో తమ పొలాల్లోకి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. సర్వే చేయకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమీలేక సర్వేకు వచ్చిన రెవెన్యూ గిర్ధావర్లు యాదగిరి, జాహెద్, సర్వేయర్ లక్ష్మీనారాయణ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలియజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో బాధిత రైతులు, అఖిల పక్ష నాయకులు ఇల్లందుల జంపయ్య, ఆవుల పెద్ద వెంకటయ్య, వెల్ధి రంగరావు, గంగాధర రాజయ్య, గాదర్ల కుమారస్వామి, రమేశ్ పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో జనగామ గ్రామ పర్యటనకు వస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను చౌటపల్లి సర్వేనంబర్ 312లోని బాధిత రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బలవంతంగా భూములు లాక్కొని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లాక్కుంటే తమకు చావే శరణ్యమన్నారు. అనంతరం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయవద్దు అంటూ వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి బండి సంజయ్ స్పందించి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.