కల్హేర్, మే 28: యాసంగిలో తాము పండించిన మొత్తం జొన్నలను కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసకుంటామంటూ రైతులు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురిని మంగళవారం ఘెరావ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కల్హేర్, కృష్ణపూర్, జొన్నల కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించి అనంతరం బీబీపేట కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. ఈ క్రమంలో నెల రోజుల పైబడి జొన్నలు కేంద్రంలోనే ఉన్నాయని, కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో తూకం చేసిన 16వేల బస్తాలకు 8వేల బస్తాల జొన్నలను గోదాముకు తరలించారని తెలిపారు. కల్హేర్లో 5వేల బస్తాలు, కృష్ణపూర్లో 7వేల బస్తాలు ఉన్నాయని, వాటిని తరలించాలని రైతులు కోరారు. అందులో బీబీపేటకు చెందిన రైతుల 140 బస్తాలు నాణ్యత లోపం ఉందనే కారణంతో వెనక్కి తిరిగి పంపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి జొన్న గింజనూ కొనుగోలు చేశారని రైతులు గుర్తుచేశారు. ఈనెల 31వ తేదీతో కొనుగోలు కేంద్రాలు మూసివేయబడతాయని అధికారులు చెప్పడంతో మిగిలిన ఆ జొన్నలను త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో మార్క్ఫెడ్ డీఎం స్పందించి జిల్లా ఉన్నతాధికారులతో చర్చించి ప్రతి జొన్నలను కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.