దుబ్బాక, ఆగస్టు 21: రైతులందరికీ రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అం దుకు భిన్నంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లిలో చాలామంది రైతులకు రుణమాఫీ వర్తించక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆరేపల్లిలో 120 వరకు రైతు కుటుంబాలు ఉన్నాయి.
వంద కుటుంబాలు రైతులు బ్యాంకు లో పంట రుణాలు తీసుకున్నాయి. ఇందులో తొలి విడతలో 25 మంది రైతులకు , 2వ విడత లో 20 మందికి , 3వ విడతలో 22 మందికి రుణమాఫీ అయ్యింది.గ్రామంలో మరో 30 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీనిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయం వద్దకు తిరుగుతూ అరిగోస పడుతున్నారు. అందరి రు ణాలు మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నేను తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు బ్రాంచ్లో రూ.1.60 లక్షలు రుణం తీసుకున్నా. నాభార్య పేరిట రూ.1.30 లక్షల రుణం తీసుకున్నం. పంటరుణమాఫీ కాలేదని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. నిత్యం బ్యాంకు, వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. – తొట్ల రాజయ్య, రైతు ఆరేపల్లి
గ్రామీణ బ్యాంకులో నా పేరిట రూ. 50 వేల చొప్పున రెండు రుణాలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రైతుకు ఒక్కటే రుణం ఉంటుంది. కానీ, ఒకే బ్యాంకులో నా పేరిట రెండు రుణాలు ఉన్నాయని అధికారులు చెప్పడి విడ్డూరం. నాకు పైసా రుణమాఫీ కాలేదు. బ్యాంకుకు పోయి అడిగితే రుణమాపీ కాలేదంటున్నారు. మాలాంటి రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. – చెట్టి లక్ష్మీనారాయణ, రైతు, ఆరేపల్లి
మాకు 5 ఎకరాల భూమి ఉన్నది. భూమిని నమ్ముకునే బతుకుతున్నం. బోరుబావులు తవ్వించేందుకు బ్యాంకులో రుణం తీసుకున్నం. నా పేరిట రూ.1.20 లక్షలు, నా భర్త ఎల్లయ్య పేరిట రూ.లక్ష బ్యాంకులో అప్పు ఉన్నది. రైతులకు సర్కారు రుణమాఫీ చేసిందన్నారు. మా రుణమాఫీ కాలేదని బ్యాంకు సార్లు చెప్పారు. మా ఊరు నుంచి 8 కి.మీ దూరంలో ఉన్న దుబ్బాక గ్రామీణ బ్యాంకుకు రోజూ వెళ్లి వస్తున్నా. ఇప్పటికీ మూడు విడతల్లో మాపేర్లు రాలేవు. మాకేందుకు రుణమాఫీ కాలేదు..మేం రైతులం కాదా.. మా బాధ సర్కారుకు పట్టదా..?.
– కాసర్ల బాలవ్వ, మహిళా రైతు, ఆరేపల్లి
నాకు రెండెకరాల భూమి ఉన్నది. బ్యాంకులో రూ.70 వేలు రుణం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించిందనగానే సంతోషపడ్డ. తొలి విడతలో నాపేరు రాలేదు. మళ్లీ రెండో విడతలో చూశాను. అందులో లేదు. ఇప్పుడు మూడో విడతలో కూడా రుణమాఫీ కాలేదు. మాలాంటి చిన్న రైతులకు రుణమాఫీ చేయలేని, ఇదేమి సర్కారో అర్థం కావడం లేదు. చెట్ల నర్సింహులు, రైతు, ఆరేపల్లి.