రామాయంపేట, మే 20: నెల రోజులు గడుస్తున్నా వరి ధాన్యం తూకం వేయకపోవడంపై అన్నదాతలు రోడ్డెక్కారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట పురపాలికలోని కోమటిపల్లి గిరిజన తండా శివారులోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని రైతులు రామాయంపేట, గజ్వేల్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని, వర్షం వస్తే పరిస్థితి ఏమిటని సిబ్బందిని నిలదీశారు. సొసైటీ సిబ్బందిని ఎప్పుడు అడిగినా రేపుమాపు అంటూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.
ధాన్యం తూకం వేసే దాకా ఇక్కడి నుంచి కదిలేదిలేదని తేల్చిచెప్పారు. రోడ్డుపై రాస్తారోకో చేయడంతో గంటపాటు జనజీవనం స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గణేశ్ డబ్బులు, మద్యానికి అమ్ముడుపోయి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట పోలీసులు, సిబ్బంది రాస్తారోకో చేస్తున్న స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. రైతులు అయినా ససేమిరా అనడంతో అక్కడే మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. రెండు మూడు రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతామని పోలీసులు చెప్పడంతో రైతులు శాంతించారు.