తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్దాస్ జానయ్య ఒక దినపత్రికలో చేసిన అడ్డగోలు వాదన చదివిన తర్వాత ‘మన ఊరు-మన చెరువు’ పుస్తక రచయితగా స్పందించకుండా ఉండలేకపోతున్నాను. ఒక ఉపకులపతి స్థానంలో ఉండి రాజకీయ విమర్శలకు తన మేధను తాకట్టు పెట్టడం పట్ల జుగుప్స కలుగుతున్నది. ఆయనలా నేను మాత్రం ఏ పార్టీ పక్షానికి పక్షపాతిని కాదని స్పష్టం చేయదలిచాను. పరోక్షంగా జానయ్య వాదన కాళేశ్వరం నీళ్లు, కరువు పరిస్థితి నుంచి ప్రజలు ఆలోచనలను డైవర్టు చేయడానికి ప్రయత్నాలు చేసినట్టు ఆయన రాతల్లో కనిపించింది.
కాళేశ్వరంపై అల్దాస్ జానయ్య వింత వాదనలు వినిపించడం కొత్త కాదు. ఇంతకుముందు కూడా పక్షపాత వైఖరితో వ్యాసాలు రాస్తూ తన అంకెల గారడీని ప్రదర్శించారు. ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇవ్వడం ద్వారా వ్యక్తిగతంగా రిటైర్మెంట్ తర్వాత కూడా తనకు జానెడు, బెత్తెడు లబ్ధి ఏమైనా జరుగవచ్చునేమో! కానీ, ఆయన తప్పుడు సలహాలు, వాదనలతో ప్రజలు నష్టపోయే ప్రమాదమున్నది. కనుక ఈ వ్యాసం ద్వారా కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజలకు అందించదలిచాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితిలో పడిపోతున్న భూగర్భ జలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాగునీటి సమస్య పక్కన పెడితే తాగునీటి సమస్య కూడా తలెత్తడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ప్రకృతి ప్రకోపించిన విపత్కర పరిస్థితి నుంచి బయటపడేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఎత్తిపోసి, క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడవచ్చు కదా అనే వాదన ప్రజల్లో చర్చ జరుగుతున్నది. ఇట్లాంటి పరిస్థితిలో కొందరు మేధావులు వింత వాదనలు వినిపించడం విడ్డూరం.
‘తెలంగాణలో దశాబ్ద కాలంపాటు వరి పంట ఉత్పత్తి 78 లక్షల టన్నుల నుంచి 2.70 కోట్ల టన్నులకు పెరుగడం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదని, బోరు బావుల సంఖ్య పెరుగడం వల్లనే’ అని చెప్పారు. ఆయన ఒకటి ఆలోచించాలి. 2014లో 16 లక్షల బోరు బావులుంటే 2024నాటికి 31 లక్షలకు చేరుకున్నాయని తెలిపారు. ఇంకోమాట దేశం మొత్తం మీద ధాన్యం ఉత్పత్తిలో పెరుగుదల 77శాతం అధికంగా నమోదైందని రాశారు. అంటే, ఇది కేసీఆర్ పాలనలో పెరిగిన బోరు బావుల సంఖ్యను, కరెంట్ వినియోగం, పెరిగిన భూగర్భ జలాలను అన్యాపదేశంగా ఒప్పుకొన్నట్టే కదా!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు రైతులు భూగర్భ జలాలు సరిగా లేక అప్పుచేసి నాలుగైదు బోర్లు వేసి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అట్లాంటి వారి సంఖ్య వేలల్లో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే తెలంగాణ కరెంట్ సమస్యను ఎదుర్కొంటుందని, ఆంధ్రా పాలకులు వాదించారు. కానీ అది కరెక్ట్ కాదని తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరూపితమైంది.
అంటే బోరుబావులు పెరిగాయని చెప్పడం ద్వారా కరెంటు కష్టాలు తొలగిపోయినట్టు ఆయన ఒప్పుకొన్నట్టే కదా! మరి ఇది ఎలా సాధ్యం అయ్యింది? అనే విషయానికి వస్తే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు కావడం వల్ల ఆయనకు నీటిపారుదల రంగం, నీటివనరుల వినియోగంపై ఉన్న అవగాహన, నీటి వనరులు ఒడిసి పట్టుకునే లక్ష్యంగా చేసిన కృషి , తెలంగాణ ఉద్యమం నీటి వనరులపై చేసిన సమీక్ష అని చెప్పడానికి ఎవరూ సంశయించాల్సిన పనిలేదు. ఒక వేళ ఆయన నీటిపారుదల రంగం మీద చేసిన కృషిని ఉద్దేశపూర్వకంగా మరుగునపరచడం, విస్మరించడం అంటే అది ఆత్మవంచనే అవుతుంది.
నీటిపారుదల రంగం, భూగర్భ జలవనరులు ప్రణాళికాబద్ధంగా పెంచడంలో, ఆహారధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రస్థానంలోకి మలచడంలో కేసీఆర్ కృషి, పట్టుదలను ప్రశంసించకుండా ఉండలేం. భౌగోళికంగా చూసినప్పుడు రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నప్పటికీ 300-600 మీటర్ల ఎత్తులో కఠిన శిలానిర్మితమైన దక్కన్ పీఠభూమితో నిండి ఉన్నది. కేవలం 60-100 సెంటీమీటర్ల సగటు వర్షపాతం మాత్రమే నమోదు అవుతున్నది. కనుక కురిసిన వర్షం కూడా కిందికి జారిపోవడం తప్ప భూమిలోకి ఇంకి పోయే భాగం చాలా తక్కువ. ఇట్లాంటి స్థితిలోనే శాతవాహనుల పరిపాలనా కాలం నుంచి చెరువులే ఏకైక నీటిపారుదల వనరులుగా భావించి, తవ్వించారు.
కాకతీయుల కాలానికి ఆ అవగాహన మరింత పెరిగి ఐదువేల చెరువులను గొలుసు కట్టు చెరువులుగా నిర్మాణం చేశారు. రామప్ప, లక్నవరం, పాకాల, ఘనపురం, బయ్యారం లాంటి తటాకాలను కూడా నిర్మించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి సగటున 750 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలుస్తున్నది. కనుక ఈ వరదనీటిని ఒడిసిపట్టి, తెలంగాణకు పారించడంలో ఆంధ్రా పాలకులు వివక్షను ప్రదర్శించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేసీఆర్ చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. 33 వేల చెరువులకు మరమ్మతులు చేయించారు. తద్వారా 12 లక్షల ఎకరాల సాగుభూమి స్థిరీకరణ హామీతోపాటు, భూగర్భ జలాలు కూడా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టు ఎత్తు పెంచి గ్రావిటీ ద్వారా నీరు పొందాలనుకునే ప్రయత్నాలను మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో గత్యంతరం లేని స్థితిలోనే కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణానికి సంకల్పించారు. చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాతనే భూగర్భ జలవనరుల స్థితి బాగా మెరుగుపడింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2012లో 11,024 చ.కి.మీ విస్తీర్ణంలో భూగర్భ జలాలు 20 మీటర్ల కంటే లోతులో ఉండేవి. 2024 నాటికి చూసుకుంటే 20 మీటర్ల కంటే లోతులో భూగర్భ జలాలు ఉండే విస్తీర్ణం 1,398 చ.కి.మీటర్లకు పరిమితమైంది. మళ్లీ అది ప్రస్తుతం 4,714 చ.కి.మీ విస్తీర్ణానికి పెరిగింది. అంటే ప్రభుత్వం 2014-23 మధ్య చేపట్టిన చర్యలతో 4.26 మీటర్ల నీటి మట్టం పెరిగి భూగర్భ జలాలు రక్షిత స్థితికి చేరుకున్నాయి. అందువల్ల బోరు బావులు, చెరువులు నిరాటంకంగా నిండాయి. సాగునీరు, తాగునీరు సురక్షిత స్థితికి చేరాయి. తద్వారా రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్లు సస్యశ్యామలంగా ఉన్నది. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. భూగర్భ జలాలు పెరుగకుండానే బోరు బావుల సంఖ్య పెరుగదని అల్దాస్ జానయ్య ఒప్పుకుంటారా? ఏ రకంగా చూసినా అది కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతోనే భూగర్భ జలాల పెంపునకు చేసిన కృషి ఫలితం మాత్రమే. తెలంగాణ సాగునీటి వాడకం 2013 నాడు 472 టీఎంసీలు అయితే, 2023 నాటికి 739 టీఎంసీలకు పెరిగింది. 56 శాతం నుంచి 89 శాతం పెరుగుదల నమోదు కావడం అనేది ప్రభుత్వ ప్రమేయం లేకుండానే సాధ్యమవుతుందా?
ఎవరైనా కావొచ్చు ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ భూగర్భ జలవనరుల అభివృద్ధికి తోడ్పడిన అంశాలు; మిషన్
కాకతీయ ద్వారా ఐదేండ్ల ప్రణాళికతో 27,472 చెరువులు మరమ్మతులు చేయడం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు నింపడం. చెక్ డ్యామ్లు, పెర్కొలేషన్ ట్యాంకుల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టడం. 30 శాతం అదనపు వర్షాలతో ప్రకృతి కూడా సహకరించడం వల్ల తెలంగాణ భూగర్భ జలాలు సురక్షిత స్థితికి చేరుకున్నాయి.
ఇప్పుడున్న ఎల్ నినో పరిస్థితిలో కూడా ఇంకా కొన్ని బోరుబావులు, చెరువులు నీటిని అందించడం వల్లనే కనీసం తాగునీటి అవసరాలు సురక్షితంగా ఉన్నాయి. పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ పాలనాపరమైన చూపు, దార్శనికత మాత్రమే ప్రజలను సురక్షిత స్థితిలో నిలబెడతాయి. ఈ విషయాలు విమర్శకులకు తెలియనివికావు. కానీ తెలిసి కూడా వక్రీకరించడమే పెద్ద తప్పు అవుతుంది. మన తెలంగాణ భూగర్భ జలవనరుల అభివృద్ధికి వాన నీటిని ఒడిసి పట్టుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఇది నూటికి నూరు శాతం తెలంగాణ భౌగోళిక జలవనరుల వాస్తవం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ఎన్.తిర్మల్
9441864514