అక్కన్నపేట, మే 15: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 15 నుంచి నెల రోజులవుతున్నా వడ్ల కాంటా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. నెల రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ శుక్రవారం యువ రైతు ఒకరు పెట్రోల్ పోసుకొని, తాను పండించిన వడ్లపై కూడా పెట్రోలు పోసి నిప్పుంటించే ప్రయత్నం చేశాడు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడికి చేరుకున్న అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ అత్యుత్సాహం చూపించారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు తీసిన పలువురిని షేర్ చేయవద్దని, ఘటనను సోషల్ మీడియాలో పెట్టకుండా ఆరాటపడ్డాడు.
ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత రైతు వంగాల శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పొలంలో వరికోతలు ఏప్రిల్ 15న పూర్తి అయ్యింది. అతను కాంటాకు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తేగా శుక్రవారంతో నెల రోజులు పట్టింది. అయినప్పటికీ వడ్లు కాంటా చేయడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల కిందట కొన్ని బస్తాల వడ్లు లారీలో పోగా, మిగిలిన వడ్ల బస్తాలు మాత్రం అక్కడే ఉండటంతో చెదలు పట్టాయన్నారు. రేపు, మాపు అంటూ వడ్ల బస్తాలను తీసుకెళ్లడం లేదన్నారు. వర్షం పడితే బతుకు ఆగమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐకేపీ మహిళ సంఘం కొనుగోలు కేంద్రం నిర్వహణ అస్తవస్త్యంగా ఉందని రైతు ఆరోపించాడు. కొనుగోలు సెంటర్ నిర్వహణ ఎవరూ బాధ్యులో, ఎవరిని అడుగాలో తెలియని పరిస్థితి ఉందన్నారు.
కాశబోయిన సమ్మయ్య, శ్రీనివాస్ రైతులు మాట్లాడుతూ… గొల్లకుంట కొనుగోలు కేంద్రంలో ఇప్పటికి 4వేల బస్తాలు ధాన్యం నింపి ఉందన్నారు. మరో 5 వేల బస్తాలను తరలించారన్నారు. ఇక్కడ రైతుల గురించి పట్టించుకునే వాళ్లే కరువుయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రక్ షీట్ లేకుండా ధాన్యం దిగుమతి అవుతున్నదని, ఇష్టారాజ్యంగా కొనుగోలు కేంద్రం నిర్వహణ జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై ధాన్యం పొసి, వడ్ల బస్తాలు పెట్టి ధర్నా, రాస్తారోకో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.