గజ్వేల్, జూన్ 19: సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పొడి నేలల్లో ముందస్తుగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నల్లరేగడి భూముల్లో రైతులు పత్తి విత్తనాలు పెట్టారు. నైరుతి రాకతో విత్తన ప్రక్రియ నల్లరేగడి భూముల్లో జోరుగా సాగుతున్నది. వానకాలం ప్రారంభమైనా, ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నల్లరేగడి భూములు బెట్టను(వర్షాభావం) తట్టుకునే అవకాశాలు ఉండడంతో రైతులు ముందుగా పత్తి విత్తనాలు పెట్టుకుంటున్నారు. ఈసారి రోహిణికార్తె ప్రారంభంలో సాధారణంగా కురిసిన వర్షానికి రైతులు పత్తి విత్తనాలు నాటుకున్నారు. మృగశిర కార్తెలో అనుకున్న విధంగా వర్షాలు కురవక పోవడంతో పత్తి విత్తనాలు పెట్టిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
సిద్దిపేట జిల్లాలో వానకాలంలో రైతులు 5.85 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందులో అత్యధికంగా 3.85 లక్షల ఎకరాల్లో వరి, 1.18 లక్షల ఎకరాల్లో పత్తి, 40వేల ఎకరాల్లో మొక్కజొన్న, 8వేల ఎకరాల్లో కందితో పాటు ఇతర పంటలు సాగు చేస్తారని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో గతేడాది 1.08లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రైతులు 1.18లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నల్లరేగడి భూముల్లో పత్తి విత్తనాలు పెట్టే ప్రక్రియను రైతులు చాలా వరకు పూర్తి చేయడంతో ఎప్పుడు వర్షాలు కురుస్తాయోనని మొగులుకు ముఖం పెట్టి ఎదురుచూస్తున్నారు. పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతుల్లో రోజు రోజుకూ ఆందోళన వ్యక్తమవుతున్నది. భారీ వర్షం కురిస్తే నల్లరేగడి భూముల్లో పెట్టిన పత్తి విత్తనాలు తప్పకుండా మొలకలు వస్తాయనే నమ్మకంతో రైతులు ఉన్నారు.
బెట్టను తట్టుకునే అవకాశం ఉన్న నల్లరేగడి భూముల్లో ఇప్పటికే రైతులు పెట్టిన పత్తి విత్తనాలకు నీళ్ల సదుపాయం ఉన్న రైతులు డ్రిప్ ద్వారా సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన రైతు స్వామి కొద్ది రోజులుగా పత్తికి డ్రిప్ ద్వారా నీళ్లు అందిస్తున్నాడు.
వాతావరణంలో మార్పులు వచ్చి భారీ వర్షాలు కురిస్తే రైతుల్లో ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడు వర్షాలు కురుస్తాయేనని రైతులు ఎదురుచూస్తున్నారు. పత్తికి మద్దతు ధర రూ.8,110 పెంచడంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి పత్తిసాగు ఎక్కువగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తికి మద్దతు ధర పెంచడంతో జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.