హుస్నాబాద్, మే 6: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీని వల్ల రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆరెపల్లి కొనుగోలు కేంద్రంలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ డిపో బైపాస్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. రైతులకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో 20 రోజులుగా కొనుగోళ్లు నత్తనడకన నడుస్తున్నాయ ని, దీంతో ఎండ, వానలో ఉండాల్సి వస్తోందన్నారు.
క్వింటాల్‌కు 5 నుంచి 6కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేసి తరుగుపేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన వద్దకు చేరుకున్న ఎస్సై లక్ష్మారెడ్డి రైతులతో మాట్లాడారు. తహసీల్దార్‌తో మాట్లాడానని, రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు మ్యాకల బాలయ్య, కాశవేని వీరయ్య, మల్లేశం, గొర్ల రాజు, కనుకయ్య, సత్యం, మహేందర్, శ్రీకాంత్, బీజేపీ నాయకులు రాజు, సాంబరాజు, మహేశ్ పాల్గొన్నారు.