సిద్దిపేట, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల్లో రుణమాఫీ టెన్షన్ వెంటాడుతోంది. మా రుణాలు మాఫీ అవుతాయా..? కావా..? అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, రెండు విడుతల్లోనూ రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేవని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదని అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
ఒకే ఇంటి పేరుతో ఉన్న రైతులను ఒకే కుటుంబంగా చూపుతున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఆ కుటుంబానికి రుణమాఫీ కాలేదు. ఇంకో కుటుంబంలో ఇద్దరి పేర్ల మీద రుణాలు ఉంటే అందులో ఒక్కరు ఇదివరకు బ్యాంకులో రుణం క్లోజ్ చేస్తే ఆ రైతుకు రుణమాఫీ వచ్చినప్పటికీ బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదు.
ఎందుకంటే రుణ ఖాతా క్లోజ్ అయింది నీకు రుణమాఫీ డబ్బులు ఇవ్వమని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన గడువులో ఆ రైతుకు రుణమాఫీ వచ్చిందని మెసెజ్ సైతం వచ్చింది. బ్యాంకు అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలా ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు. సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాఫీ రావడం లేదని పలువురు రైతులు తెలుపుతున్నారు. రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ మాఫీ అయితదా..? లేదా..? అని రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
సార్.. మాకెందుకు రుణమాఫీ కాలేదు. మేమేమి తప్పు చేశాం…అంటూ రైతులు గొల్లుమంటున్నారు. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు అంతా గందరగోళంగా ఉన్నాయి. అర్హత ఉన్న చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు. ఇదేంటని సొసైటీ అధికారులను అడిగితే సరైన సమాధానం రావడం లేదు. ఏదేదో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తంగా 50శాతం రుణాలు కూడా మాఫీ కాలేదని రైతులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 37 సొసైటీల్లో 22,086 మంది రైతులు రూ.212.46 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీరిలో తొలి విడుత 6,090 మంది రైతులకు రూ.25.13 కోట్లు, రెండో విడుతలో 2,134 మంది రైతులకు రూ.21. 02 కోట్లు, మెదక్ జిల్లాలో 31 సొసైటీల్లో 29,519 మంది రైతులు రూ.153.76 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీరిలో తొలి విడుతలో 9,271 మం దికి రూ.34.39 కోట్లు, రెండో విడుతలో 2,599 మంది రైతులకు రూ.18.61 కోట్లు, సిద్దిపేట జిల్లాలో15 సొసైటీల్లో 11,980 మంది రైతులు రూ.85.17 కోట్ల రుణాలు తీసుకున్నారు.
వీరిలో తొలి విడుతలో 4,193 మందికి రూ. 15.69 కోట్లు, రెండో విడుతలో 1,345 మంది రైతులకు రూ. 10.74 కోట్ల రుణమాఫీ వచ్చింది. ఇంకా ఉమ్మడి జిల్లాలో చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు ఆయా సహకార బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రుణమాఫీ అవుతుందా…? లేదా అని వారిలో ఆందోళన నెలకొన్నది. ఉమ్మడి మెద క్ జిల్లాలోని కొన్ని సొసైటీల లెక్కలు చూస్తే చాలామంది రైతుల రుణాలు మాఫీ కాలేదని అర్ధమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మూడు విడుతలుగా రుణమాఫీ చేస్తామని చెప్పింది. అందులోభాగంగా ఇటీవల రెండు విడుతల్లో లక్షన్నరలోపు రుణాలను మాఫీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,32,014 మంది రైతులకు రూ.1,596. 38 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే ఉంది. ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పథకంలో గందరగోళం నెలకొన్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులకు మాత్రమే రుణ మాఫీ కటాఫ్ పెట్టింది. అసలు వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఈమేరకు తొలి విడుతలో జూలై 18న లక్ష రూపాయల వరకు, జూలై 30న లక్షన్నరలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ రుణమాఫీలో ప్రభుత్వ నిబంధనలు, టెక్నికల్ సమస్యలతోపాటు రేషన్ కార్డు, రుణఖాతా క్లోజ్ కావడం తదితర సమస్యలతో చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు.
ప్రధానంగా ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా రూ.2 లక్షల వరకే వర్తిస్తుందిని షరతు పెట్టింది. అదే కుటుంబంలో తక్కువరుణం తీసుకున్న వారిని చూసి మొత్తంగా రెండు లక్షల వరకు లెక్కలు తీసి మాఫీ చేయాల్సిన ప్రభుత్వం ఆ కుటుం బం మొత్తాన్ని పక్కన పెట్టింది. ఏమన్న అంటే మూడో విడుతలో మాఫీ అవుతుందని చెబుతున్నారు. మరోవైపు ఆ కుటుం బం మొత్తం రెండు లక్షలపైన ఉన్నది క్లీయర్ చేస్తేనే ఆ కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఎన్నో కొర్రీలు పెడుతున్నది.