సంగారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ):రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ఆర్) భూసేకరణపై సంగారెడ్డి జిల్లాలోని రైతులు తిరగబడుతున్నారు. ఆర్ఆర్ఆర్కు భూ ములు ఇచ్చేదిలేదని రైతులు ఆందోళనకు దిగుతున్నా రు. విలువైన తమ భూములను సేకరించవద్దని సర్వే పనులను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం భూసేకరణ సర్వే పనులను అడ్డగిస్తున్న రైతులను అరెస్ట్‌లు చేస్తుండడంతో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం డిజై న్లు మాటిమాటికి మారుస్తున్నది. దీంతో రైతుల నుంచి సేకరించాల్సిన భూముల విస్తీర్ణం వందల ఎకరాలు పెరుగుతున్నది.
ఆర్ఆర్ఆర్ నిర్మాణం పేరిట ఏడాదికి రెండు పంటలు పండే విలువైన తమ భూములను తీసుకోవడంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం ఇది వరకు సంగారెడ్డి జిల్లాలోని చౌటకూరు, హత్నూర మండలాల్లోని రైతు లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనలకు దిగారు. ఇటీవల సదాశివపేట మండలానికి చెందిన పెద్దాపూర్, కొండాపూర్ మండలానికి చెందిన గిర్మాపూర్ రైతులు ఆర్ఆర్ఆర్కు భూములు ఇచ్చేదిలేదంటూ ఆందోళనకు దిగారు. గురువారం ఆర్ఆర్ఆర్ డిజిటల్ సర్వే పనులను పెద్దాపూర్, గిర్మాపూర్ రైతులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా, శుక్రవారం సైతం రైతులు ఆర్ఆర్ఆర్కు భూములు ఇవ్వమంటూ ఆందోళనకు దిగారు. పెద్దాపూర్, గిర్మాపూర్తోపాటు సంగారెడ్డి, చౌటకూరు, హత్నూర మండలాల్లో భూముల విలువ కోట్ల రూపాయలు పలుకుతున్నది. దీంతో రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వారసత్వంగా ఏండ్ల తరబడి వస్తున్న తమ భూములను రోడ్ల నిర్మాణానికి లాక్కుంటే తమ కుటుంబాలు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 333 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. ఉత్తర భాగంలో 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో 175 కిలోమీటర్లమేర ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నది. ఉత్తర, దక్షిణ భాగం కలిపి సంగారెడ్డి జిల్లాలో 27.5 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నారు. ఇందుకోసం మొదట సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, హత్నూర మండలాల్లోని 11 గ్రామాల్లో 361.23 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు.
చౌటకూరు మండలంలోని ఐదు గ్రామాల్లో 298.3 ఎకరాల భూమి సేకరణకు సర్వే జరిపారు. మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో 659.53 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు సర్వే పనులు మొదలు పెట్టారు. సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో డిజిటల్ సర్వే పనులు మొదలు పెట్టగా రైతులు అడ్డుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ డిజైన్ల మార్పుతో సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఇది వరకు 659.53 ఎకరాల భూమి సేకరించాల్సి ఉం డగా, అధికారవర్గాల సమాచారం మేరకు భూ సేకరణ విస్తీర్ణం 853 ఎకరాలకు పెరిగినట్లు తెలిసింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాణ డిజైన్లు మాటిమాటికి మార్చుతుండడంతో సేకరించాల్సిన భూ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఇది వరకే జిల్లాలోని రైతులు ఆర్ఆర్ఆర్కు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. డిజైన్ల మార్పుతో మరింత భూసేకరణ చేయాల్సి వస్తుండటంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో సంగారెడ్డి, కొండాపూర్,సదాశివపేట, హత్నూర మండలాల్లో మొదట 361.23 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. డిజైన్ల మార్పు కారణంగా ఇప్పుడు భూసేకరణ విస్తీర్ణం 555 ఎకరాలకు పెరిగింది. జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు ఇబ్బందులు కలుగకుండా ఆర్ఆర్ఆర్ నిర్మాణం డిజైన్లు సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారిపై వాహనాలు సులువుగా ప్రయాణించేందుకు మొదట పెద్దాపూర్ వద్ద ఇంటర్చేంజ్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇంటర్చేంజ్ నిర్మాణానికి పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల మధ్య 107 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ఇంటర్చేంజ్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. కాగా, ప్రభుత్వం తాజాగా పెద్దాపూర్ వద్ద ‘డంబెల్ ఇంటర్చేంజ్’ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారికి ఇరువైపులా డంబెల్ ఆకారంలో ఇంటర్‌చేంజ్‌లను నిర్మిస్తారు. తద్వారా జాతీయ రహదారితో సంబంధం లేకుండానే ఆర్ఆర్ఆర్ పై ప్రయాణించే వాహనదారులు రాకపోకలు సాగించవచ్చు.
డంబెల్ ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణంతో ఆర్ఆర్ఆర్పై ప్రయాణించే వాహనదారులు సులువుగా అటు హైదరాబాద్ వైపు ఇటు ముంబయి వైపు వెళ్లే జాతీయ రహదారులకు చేరుకోవచ్చు. కాగా, పెద్దాపూర్ వద్ద ‘డంబెల్ ఇంటర్ చేంజ్’ నిర్మాణంతో అదనంగా 86 నుంచి 100 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి వస్తున్నది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంబెల్ ఇంటర్చేంజ్ నిర్మాణంతో పెద్దాపూర్, గిర్మాపూర్ గ్రామాల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. దీంతో రెండు గ్రామాల రైతులు ఆర్ఆర్ఆర్కు భూములు ఇచ్చేది లేదని ఆందోళన చేస్తున్నారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్‌ను కలిసి రైతుల ఆందోళనను వివరించారు. బలవంతంగా భూసేకరణ తగదని, రైతులకు సమాచారం ఇవ్వకుండా భూసర్వే ఎలా చేస్తారని ఎమ్మెల్యే అదనపు కలెక్టర్‌ను ప్రశ్నించారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
కొండాపూర్, ఆగస్టు 14: ట్రిఫుల్ఆర్కు భూము లు ఇచ్చే ప్రసక్తే లేదు. నాకు ఉన్న 3 ఎకరాల ఐదు గుంటల భూమి మొత్తం పోతే మేం ఎట్లా బతకాలి. ప్రభుత్వం మా భూముల వద్దకు రావొద్దు. ప్రభుత్వ భూములను వదిలి పంట భూముల నుంచి ట్రిఫుల్ఆర్ను తీసుకెళ్లడం సమంజసం కాదు. మా బిడ్డల బతుకులు రోడ్డు పాలు చేయకండి. రూ. 4 నుంచి రూ.6 కోట్లు పలికే విలువైన భూములను వదులుకోం.
– వేణుగోపాల్, రైతు, గిర్మాపూర్, సంగారెడ్డి జిల్లా
కొండాపూర్, ఆగస్టు14: భూమికి భూమి ఇవ్వా లి లేదంటే మొత్తం అలైన్మెంట్ మార్చాలి. మేము చిన్న సన్నకారు రైతులం. మాకు ఉన్న ఐదు ఎకరాల పొలం ట్రిపుల్‌ఆర్‌లో పోతే మా బతుకుదెరువు ఆగమైతది. మాకు బతుకుదెరువు కావాలంటే ప్రభుత్వం భూమికి భూమి ఇప్పించాలి లేదంటే ట్రిపుల్ఆర్కు సంబంధించిన రోడ్డు మ్యాపును మొత్తానికే తొలిగించాలి. లేదంటే మార్కెట్ ధర చెల్లించాలి.
– పట్లోళ్ల ఆంజనేయులు, రైతు, గిర్మాపూర్, సంగారెడ్డి జిల్లా
కొండాపూర్, ఆగస్టు14: మా నాయన పేరు మీద ఉన్న భూమి ఎకరం 15 గుంటలు పోతున్నది. నా పేరుమీద ఉన్న భూమి 30 గుంటలు పోతున్నది. మా నాయన పేరు మీద ఉన్న భూమి ప్రస్తుతం ఎకరాకు రూ.4 కోట్లు, నా పేరు మీద ఉన్న భూమి రూ.6 కోట్లు పలుకుతున్నది. ట్రిపుల్ఆర్ వల్ల గిర్మాపూర్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు. పక్కనే ప్రభు త్వ భూమి ఉన్నా మా పొలాలను తీసుకుంటున్నా రు. మాకు భూమికి భూమి ఇవ్వాలి లేదంటే అలైన్మెంట్ మార్చాలి.
– పట్లోళ్ల యాదగిరి, రైతు, గిర్మాపూర్, సంగారెడ్డి జిల్లా