నంగునూరు, మే 24: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో హనుమకొండ-సిద్దిపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ, మిల్లర్లు సహకరించక పోవడంతోనే కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని రైతులు మండిపడ్డారు.వారాల తరబడి పడిగాపులు కాస్తున్నామని, ఎండలు, అకాల వర్షాలకు సతమతమవుతున్నామని రైతులు వాపోయారు. మిల్లర్లు తాలు పేరుతో క్వింటాల్‌కు కిలోల కొద్దీ కోత పెడుతూ నష్టం చేస్తున్నారని ఆరోపించారు. పంట కోసం పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా లేదని, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
జిల్లా ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. రైతుల ధర్నాతో హనుమకొండ-సిద్దిపేట రహదారిపై దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజగోపాలపేట ఎస్సై టి.వివేక్ తన బృం దంతో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో చర్చించి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.