హుస్నాబాద్, ఆగస్టు 11: నాట్లు వేసి కలుపు తీసే సమయం కాబట్టి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట రైతులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కొరతను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రైతులు వేసిన పంటలకు సరిపడా ఎరువులు దొరకడం లేదన్నారు. ఎరువుల కోసం వ్యవసాయ పనులు వదులుకొని దుకాణాల వెంట తిరగాల్సి వస్తోందన్నారు. దుకాణాదారులు రైతులకు ఒకటి రెండు బస్తాలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని, ఇచ్చే యూరియా బస్తాలకు ఇతర ఫెస్టిసైడ్ ఎరువులు అంటగడుతున్నారని ఆరోపించారు. దీంతో రైతులపై ఆర్థిక భారం పడుతున్నదన్నారు. ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఎరువులను బ్లాక్ చేసేందుకు కుట్రలు చేస్తున్నందున స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నియోజకవర్గ నాయకుడు గుగులోతు శివరాజ్, బీఆర్ఎస్ నాయకులు మేకల వికాస్‌యాదవ్, రైతులు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 11: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ క్యాష్ కౌంటర్ వద్ద మూడు రోజులుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అరకొరగా అందుబాటులో ఉన్న యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు నిరీక్షిస్తున్నారు. రోజంతా యూరియా కోసం క్యూలో ఉన్నా రైతులకు పలు ఆంక్షలు పెడుతూ రెండు బస్తాలు అందజేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ యూరియా కొరత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సరిపడా యూరియా దొరకడం లేదన్నారు. యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేవని గుర్తుచేశారు.