నారాయణరావుపేట, మే 8: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతులు శుక్రవారం సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై అధికారులు, మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసినెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని, తేమశాతం వచ్చినా కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వేగం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేశ్, తహసీల్దార్ జయంత్ అక్కడికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడి ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లారెడ్డి, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, రైతులు పాల్గ్గొన్నారు.