న్యాల్కల్, ఆగస్టు 21: రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కొర్రీలతో సగం మంది రైతులకు రక్త ‘హస్తం’ చూపిస్తున్నది. ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ రైతు ను పలకరించినా పంట రుణమాఫీ కాలేదన్న ఆవేదనే వినిపిస్తున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ కెనరా బ్యాంకు పరిధిలో రుక్మాపూర్, ముం గి, మిర్జాపూర్(ఎన్), తాట్పల్లి, టేకూర్, గుం జోట్టి, రాంతీర్థం, మల్కన్పాడ్, హద్నూర్తో పాటు ఝరాసం గం మండలం ఎల్గోయి గ్రామాల రైతులు ఉన్నారు. ఆయా గ్రామాల పరిధిలో రూ.లక్షలోపు నుంచి రూ.
రెండు లక్షలకు పైగా పంట రుణాలు తీసుకున్న రైతులు 2,000 మంది ఉన్నారు. వీరికి రూ.22 కోట్ల వరకు పంట రుణమాఫీ కావాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతం పంట రుణమాఫీ అయిన రైతులు 746 మంది ఉండగా వారికి రూ.8.40 కోట్ల మేరకు పంటరుణమాఫీ జరిగిం ది. ఇంకా పంటరుణమాఫీ జరగాల్సిన రైతులు 1,254 మంది ఉన్నారు. వారికి రూ.13.60 కోట్ల మాఫీ కావా ల్సి ఉన్నది. వీరందరికీ వివిధ కారణాలు చూపుతూ పంట రుణమాఫీ చేయలేదు.ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట రుణమాఫీ కాని రైతులందరూ దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారులు సూచించడం తో రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలు, రైతు వేదిక వద్ద బారులు తీరుతున్నారు.
షరతులు లేకుండా పంట రుణమాఫీ చేయాలి. రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు పంట రుణాలు తీసుకుని అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటివరకు రైతు భరోసా లేక, పంట రుణమాఫీ కాక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులు బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పంట రుణమాఫీ కాకపోవడానికి ప్రభుత్వం విధిస్తున్న షరతులు, సాంకేతిక సమస్యలతో రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇచ్చినమాట ప్రకారం ఎలాంటి నిబంధనలు లేకుండా అర్హత ఉన్న రైతులందరికీ పంట రుణమాఫీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-ఎంఆర్.ప్రవీణ్‌కుమార్, పీఏసీఎస్, డెరెక్టర్, బీఆర్ఎస్ నేత, హద్నూర్