మెదక్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): సన్నధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించకపోవడం, మరోవైపు మిల్లర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు రకరకాల కొర్రీలు పెట్టి ధరను పూర్తిగా తగ్గిస్తున్నారు. కోతలు ప్రారంభ సమయంలో క్వింటాల్‌కు రూ.2,500 చెల్లించి కొనుగోలు చేసిన మిల్లర్లు.. ఇప్పుడు సన్నధాన్యం అధికంగా వస్తుండడంతో ధరను పూర్తిగా తగ్గించారు.
క్వింటాల్‌కు రూ.2,150 నుంచి రూ.2,400 మించి చెల్లించడం లేదు. కొందరికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,320 కూడా చెల్లించడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. దొడ్డు ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండగా.. సన్నాలను మాత్రం మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సారి సన్నాలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో 91 కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఈ కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులు మిల్లర్ల వద్దకు తీసుకువెళ్తున్నారు. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు ధరలో కోత పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు ఈ వానకాలం సీజన్లో సన్నధాన్యాన్ని పండించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే రూ.500 బోనస్ అందనుందో లేదోనన్న భయాందోళనలో రైతులు ఉన్నారు. మెదక్ జిల్లాలో ఈ సీజన్లో మొత్తం 2,97,399 ఎకరాల్లో వరిసాగు కాగా అందులో 1,04,974 ఎకరాల్లో సన్న వరి, 1,92,365 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 488 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో సన్న ధాన్యం సేకరణ కోసం 91 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 300 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు 41 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా, రైతులు ధాన్యాన్ని శుద్ధి చేయకుండా 40 కిలోల బస్తాకు 43కిలోల చొప్పున తూకం వేయిస్తున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం 17 శాతం తేమ వస్తేనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. అలా తెచ్చిన ధాన్యానికి మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ మిల్లుల్లో అయితే నేరుగా కొనుగోలు చేస్తారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ధాన్యాన్ని ఆరబెట్టడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో రైతులు మిల్లర్లు చెప్పిన రేటుకే విక్రయించి నష్టపోతున్నారు.