పల్లెల్లో మళ్లీ పాత రోజులు వచ్చాయి. సమైక్య పాలన నాటి పరిస్థితులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. మార్పు అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రధానంగా రైతులకు సర్కారు నుంచి చేయూత లభించక పోవడంతో అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవుసం చేయడం రైతులకు సవాలుగా మారింది. బీఆర్ఎస్ పాలనలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా, సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించడం, గ్రామాల్లోనే మద్దతు ధరకు పంట ఉత్పత్తులు కొనడంతో రైతులు ధీమాగా పంటలు పండించారు.
ప్రస్తుతం అన్నదాతలకు ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మండుటెండల్లో హల్దీ, కూడవెల్లి వాగుల్లో గోదావరి జలాలను పారించింది. రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపి, వాటి ద్వారా అనేక చెరువులు, చెక్‌డ్యామ్‌లకు జలాలను తరలించింది. సింగూరు జలాలను మెతుకుసీమ రైతుల అవసరాలకే కేటాయించింది. వేసవికి ముందే రిజర్వాయర్లు నుంచి చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, హల్దీ, కూడవెల్లి వాగులను నింపడంతో నీటికి ఇబ్బంది ఎదురుకాలేదు. భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల కింద మంచిగా పంటలు పండినయి. దీంతో గుంట జాగా లేకుండా సాగులోకి వచ్చింది.
ప్రస్తుతం కరెంట్ కోతలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మాటిమాటికి కరెంట్ ట్రిప్ అవుతుండడం, భూగర్భ జలాలు అడుగంటి బోరుమోటర్లు, ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పెరిగి కాలిపోతున్నాయి. త్రీఫేజ్ కరెంట్ కూడా ఇష్టం వచ్చినట్లు వస్తుండడంతో పొలాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకోవడానికి రైతులు బోర్లు వేయిస్తున్నారు. ఏ ఊరిలో చూసినా రైతులు బోర్లు తవ్వించే పనుల్లోనే నిమగ్నమయ్యారు. 700 ఫీట్లు వేసినా కొన్ని ప్రాంతాల్లో నీరు రావడం లేదు. సిద్దిపేట జిల్లాలో క్రేన్లతో రైతులు బావుల్లో పూడిక తీయిస్తున్నారు. బోరు మెకానిక్ షాప్‌లకు గిరాకీ పెరిగింది. మళ్లీ పాత రోజులు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు అంటే గిదేనా అని ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్ , ఉమ్మడి మెదక్ జిల్లా, మార్చి 6
బోరుల్లో నీళ్లు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నాం. పంట ఎండిపోతుండడంతో బాధగా ఉన్నది. ఈసారి నీళ్లకు చానా ఇబ్బంది అవుతున్నది. గత ప్రభుత్వం మాదిరిగా ప్రాజెక్టుల ద్వారా కాలువలకు నీళ్లు వదిలితే బోర్లలో మంచి నీళ్లు వస్తుండే. పంటలు ఎండిపోయిన రైతులకు సర్కారు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– కుమ్మరి మల్లయ్య, రైతు, తొనిగండ్ల, మెదక్ జిల్లా
భూగర్భ జలాలు అడుగంటడంతో పొలానికి సరిగ్గా నీరు అందడం లేదు. దీంతో పగలు, రాత్రి అనే తేడాలేకుండా పొలం వద్దనే ఉంటూ పారకం పెడుతున్న. దీంతో బోరు మోటర్లపైన భారం పడుతున్నది. మోటర్లు కాలిపోతున్నయి. మా చుట్టుపక్కల గ్రామాల రైతులకు కాలువల ద్వారా నీరు వచ్చింది. ఇప్పటికి అదే మార్గం ఉంది. కానీ, మాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. ప్రభుత్వం కాలువల మీద దృష్టి పెడితే బాగుంటుంది.
– మంగళి అంజయ్య, రైతు, తొనిగండ్ల, మెదక్ జిల్లా
హుస్నాబాద్ టౌన్, మార్చి 6: చి‘వరి’ ఆశలు ఆవిరైపోతున్నాయి. ఇరవై రోజులుగా బాయిల నీళ్లు ఎల్లుతలేవు. వేసిన ఎకరంన్నర వరిల ఇరవై గుంటలకుపైగా ఎండిపోయింది. ఇగ ఎకరం ఉన్నా.. ఆది కూడా వరుస తడులు పారినయ్. వాటి కూడా నీళ్లు అందుతలేవు. ఎందుకో ఎనిమిది ఏండ్ల నుంచి ఎన్నడూ గిట్ల కాలేదు. పోయిన ఏడు బాయిల పూడిక తీయించిన, సైడ్కూడా ఏసిన. అయినా వరి పారతలేదు. ఎండిపోయింది… ఏం చేయాలో తెల్వక బర్లకు వరి కోసుకపోమన్న. ఇదీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని రైతు పినికాశి యాదగిరికి చెందిన ఎవుసం గోస.
బాయిల నీళ్లు మంచిగనే ఎల్లుతున్నయని మక్క ఎయ్యకుండ వరి ఏసిన. మంచిగనే పంట వత్తదని ఆశ ఉండే. అందుకనే మిత్తికి నలభై వేల రూపాయలు తెచ్చి ఎవుసానికి పెట్టుబడి పెట్టిన. లచ్చ రూపాయల దాక పంట పండుతదని శాన ఆశ ఉండే. వరి అంత పొట్టకు వచ్చి ఈనుతాంది గంతే నీళ్లు ఎల్లుడు బంద్ అయినయి. ఏం జెయ్యాలే గంట కూడా నీళ్లు ఎల్లుతలేవు. ఎప్పుడు బైరోని చెరువు ఊట మంచిగుండే మాకు మరి. ఎందుకో ఆ ఊట కూడ ఇప్పుడు కనబడతలేదు. ఈ నీల్లతో వరి ఎట్లపారిచ్చుడో అర్థం అవుతలేదు. ఎండలు కూడ బాగా కొడుతున్నయి. చేసిన అప్పులు కట్టలేక ఇంత ఆడ ఈడ మేస్త్రీ పనులకు పోతున్న. లేకుంటే ఇల్లు ఎల్లటట్టులేదు. కాలం గిట్లేందుకు సేసిందో… మేము ఎట్లబతుకుడో అర్థమవులేదు.
– పినికాశి యాదగిరి,రైతు, హుస్నాబాద్