సంగారెడ్డి, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): రకరకాల కారణాలు పెట్టి సర్కారు తమ పం ట రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతు ల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు రగిలిపోతున్నారు. దీనిపై మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సోమవారం రైతులు పెద్దసంఖ్యలో సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ రైతులు నిత్యం ప్రదక్షిణ లు చేస్తున్నప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 5వేల మందికిపైగా రైతులు అధికారికంగా రుణమాఫీ కాలేదం టూ ఫిర్యాదు చేశారు. రుణమాఫీపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతుండడంతో ప్రభు త్వం మండలాల వారీగా సంగారెడ్డి జిల్లాలో 27 మంది మండల వ్యవసాయ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి వారికి ప్రత్యేకంగా యాప్ ఇచ్చింది. రుణమాఫీపై వచ్చే ఫిర్యాదులను యాప్‌లో రోజువారీగా ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నోడల్ అధికారులకు ఇచ్చిన యాప్ సరిగా పనిచేయడం లేదని తెలిసింది.
కంది మండలం కాశీపూర్‌లో రైతులు రుణమాఫీ అమలు కాక ఇక్కట్లు పడుతున్నారు. 2వేల జనాభా ఉన్న కాశీపూర్‌లో 1200 ఎకరాల సాగు భూమి ఉంది. 300 మందికిపైగా రైతులు ఉన్నారు. కందిలోని ఎస్బీఐ, డీసీసీబీ బ్యాంకులో గ్రామంలోని 200 మందికిపైగా రైతులు పంటరుణాలు తీసుకున్నారు. గ్రామంలో అధికశాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రేవంత్ సర్కార్‌పై వారు మండిపడుతున్నారు.
కాశీపూర్‌లోని నాకు న్న ఎకరం పొలంపై రూ.42 వేల పంట రుణం తీసుకున్నా. ఇప్పుడు వడ్డ్డీతో కలి పి పంట రుణం రూ. 50వేలు దాటింది. నాకు తెల్లరేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉంది. రుణమాఫీకి వందశాతం అర్హ త ఉంది. అయినా రూ.50 వేల పంట రుణం మాఫీ కాలేదు. ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని కోరుతున్నా.
– మల్లమ్మ, రైతు, కాశీపూర్