యాసంగి సాగుకు రైతుబంధు పదో విడత డబ్బులను ప్రభుత్వం బుధవారం నేరుగా రైతుల ఖాతాల్లో వేసింది. తొలిరోజు ఎకరంలోపు రైతులకు డబ్బులు పడ్డాయి. సిద్దిపేట జిల్లాలో 1,17,513 మంది రైతులకు రూ.41.86కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 2,22,423 మంది రైతులకు రూ.32.97కోట్లు, మెదక్ జిల్లాలో 1,15,553 మంది రైతులకు రూ.21.88 కోట్లను బుధవారం జమ చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు, బీఆర్ఎస్ నేతలు సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
సంగారెడ్డి, డిసెంబర్ 28: రైతు సంక్షేమానికి కట్టుబడి అన్ని రకాలుగా సేవలందిస్తూ సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడయ్యారని టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. రైతుబంధు పదో విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం సంగారెడ్డిలోని ఆయన తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై విషం చిమ్ము తూ, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని అపలేదన్నారు. యాసంగి పంటకాలానికి ముందే రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతులకు దేవుడయ్యారని మరోసారి గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధిని ఎన్ని విధాలుగా అడ్డుకున్నా తెలంగాణ ప్రజల మదిలో బీజేపీకి స్థానం లేదని, అభివృద్ధిని చూసి నిధులు మంజూరు చేయాల్సిన కేంద్రం అడ్డుకోవడం విడ్డూరమని విమర్శించారు. బీజేపీకి దమ్ము, దైర్యం ఉంటే బీజేపీ పాలిత రాష్ర్టాలలో రైతులకు పెట్టుసాయం అందజేసి, నిజాయితీ నిరూపించుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక, మహారాష్ర్టల ప్రజలు తెలంగాణలో కలవాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. పదో విడత రైతుబంధు నిధు లు విడుదల చేసిన సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావుకు చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో రైతుల కష్టాలు తెలిసిన మొదటి సీఎం కేసీఆర్ సారు. రైతుబంధు ద్వారా ప్రతి రైతుకు లాభం చేకురుతుందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉందని తెలియజేయడానికే పెట్టుబడి అందజేస్తున్నారు. 60 ఏండ్లల్లో ఏ ప్రభుత్వం కూడా రైతులకు ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. ఇలాంటి ప్రభుత్వం దేశ రాజకీయాల్లో రాణిస్తుందనే నమ్మకం ఉంది.
– లచ్చన్న, రైతు జోగిపేట
సరైన సమయానికి డబ్బులు అందాయి. రెండు రోజుల్లో నాట్లు వేస్తా. మొన్న వడ్లు అమ్మిన డబ్బులు, ఇప్పుడు రైతుబంధు వరి నాట్లు వేయడానికి ఉపయోగపడతాయి. బీఆర్ఎస్ పార్టీనే తిరిగి అధికారంలోకి రావాలని, ఇలాగే మా రైతులకు సాయం చేయాలి.
– రమావత్ రాజు నాయక్, నల్లకుంట తండా, టేక్మాల్
సీఎం కేసీఆర్ రైతు అభివృద్ధి చెందాలని పంట పెట్టుబడి ఖర్చులకు రైతుబంధు పేరుతో నగదు ఇవ్వడం ఎంతో గ్రేట్. నాకు ఒక ఎకరం భూమి ఉంది. వేసిన తుకం నాటుకు వచ్చింది. సీఎం కేసీఆర్ వేసిన పంట పెట్టుబడి సాయంతో నాటువేసే పనులు మొదలుపెడుతాను. సీఎం సారుకు రుణపడి ఉంటాను.
– బేగరి యాదగిరి, రైతు, గూడురు, శివ్వంపేట మండలం
సీఎం కేసీఆర్ సార్‌ది గొప్ప మనుసు. సరియైన సమయంలో రైతుబంధు సాయం అందించి ఆదుకుంటున్న దేవుడు. సీఎం సారే నేరుగా యాసంగి, వానకాలం సీజన్లలో పంటలకు సాగు ఖర్చుకు డబ్బులను బ్యాంకులో వేస్తుండు.
– కిషన్, రైతు, సుతారిపల్లి, రామాయంపేట
యాసంగి పంటల కోసం ఖర్చులకు సీఎం కేసీఆర్ సార్ పంట పెట్టుబడికి పైసలు బ్యాంకులో వేసిండు. ప్రతి సీజన్‌కు సీఎం సార్ మాకు పంటల ఖర్చులకు పైసలు ఇస్తుండు. ఆ పైసలతోనే మేము పంటలను వేసుకుంటున్నాం. అప్పులు గాకుండా చూసుకుంటున్న ముఖ్యమంత్రి దొకరికిండు. జీవితంలో కేసీఆర్ సార్‌ను మరిచిపోం.
– కేతావత్ సుజాత, గిరిజన తండా, రామాయంపేట
యాసంగి పంటకు వ్యాపారుల దగ్గరికి అప్పుకు పోకుండా సీఎం కేసీఆర్ కరెక్ట్ టైంలో రైతుబంధు పైసలు రైతుల బ్యాంక్‌ల అకౌంట్లో వేస్తుండు. నా పేరు మీద ఎకరం భూమి ఉంది. నాకు రూ.5 వేలు జమ అయినయి. పంటల సాగుకు ఏడాదికి రెండు సార్లు పైసలు ఇస్తున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట దైవం.
– స్వామి, రైతు, నిజాంపేట
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు. ప్రతి పంటకు రైతుబంధు డబ్బులు ఇస్తు లాగోడికి ఆదుకుంటుండు. రైతుబంధు డబ్బులు రావడంతో వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోవడం మానేశాం. సరైన సమయంలో డబ్బులు అకౌంట్లో వేసి మమ్మల్ని ఆదుకుంటుండు. ప్రతిసారి లాగానే ఈ సారి కూడా డబ్బులు అకౌంట్లో పడ్డాయి.
– నీరుడి కుమార్, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్
యాసంగి సీజన్ ప్రారంభం కాగానే పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పెట్టుబడి భారమవుతున్న పరిస్థితుల్లో రైతు బంధు సాయం అందించడం అభినందనీయం. పదో విడత రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– ప్రభాకర్, రైతు, ఖలీల్పూర్, న్యాల్కల్ మండలం
రైతుబంధు పథకం అచ్చినప్పటి సంది ఎవుసపోల్ల ఆపతి తీరింది. పంట పెట్టుబడికి ఎవరి దగ్గర చేయి చాపకుండా సౌలత్ చేసింది సర్కార్. ఎకరం ఐదు వేలు ఇచ్చుడంటే మాటలు కాదు. నాకు 28 గుంటల భూమి ఉన్నది. ఈపొద్దు నా బ్యాంకు ఖాతాల రూ.3,500లు పడ్డయి. సీఎం సారు మెసేజ్ గూడ అచ్చింది. సీఎం కేసీఆర్ సార్, ఈ సర్కార్ సల్లంగ ఉండాలని దీవెనార్తులు ఇస్తున్నా.
– తెనుగు యాదగిరి, రైతు, సత్తెగామ, నారాయణఖేడ్ మండలం
సీఎం కేసీఆర్ రైతులకు రెండుసార్లు రైతుబంధు పైసలు దేవుడిలా వెయ్యడం సంతోషంగా ఉంది. రైతుల సమస్యలు తెలిసిన ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో, రాష్ట్రంలో రైతులే అప్పులు ఇచ్చేవారయ్యారు. ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగా ఉండాలి.
– సుభాశ్, రైతు, ఖమ్మంపల్లి
ప్రతి ఏడాది రెండు పంటలకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందుస్తున్నడు. గింత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం దేశంలోనే ఆదర్శంగా నిలిచిండు. రైతు బంధు డబ్బులను ఎరువులు విత్తనల కోసం వినియోగిస్తా. రైతుల కోసం ఇలాంటి పథకాలు తేవడం అదృష్టంగా భావిస్తున్నా.
– మోహన్ నాయక్, రైతు మాల్కాపూర్, మెదక్ మండలం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని రైతులందరికీ రైతుబంధు వస్తున్నది. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరికీ మంచి జరుగుతుంది.
– శంకర్, వెంకటాపూర్ రైతు, కోహీర్ మండలం
సీఎం కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకోవడానికి యాసంగిలో రైతులకు రైతుబంధు పంపిణీ చేయడం వల్ల ముందే సంక్రాంతి సంబురాలు చేసుకున్నట్లు ఉంది. రైతులు గర్వించేలా ప్రతి సీజన్లో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం చేయడం వల్ల రైతులందరం ఖుషిపడుతున్నం. ఈపెట్టుబడిసాయంతో మాపంటపొలాలను సాగు చేసుకుంటాం. పెట్టుబడి సాయం అందడం వల్ల అప్పు లేకుండా పంటలను సాగు చేసుకుంటున్నం. రైతుబంధు వచ్చినప్పటి నుంచి అప్పుల కష్టాలు తీరినయ్, దున్నకాల నుంచి ఎరువులు, కూలీల ఖర్చు ఈపెట్టుబడిసాయంతో తీరింది. రైతులకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ సార్‌కు రైతుల తరపున ధన్యవాదాలు.
– నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు, గుమ్మడిదల
నా పేరు మీద రెండెకరాల భూమి ఉంది. 2018లో రైతుబంధు కింద ఎకరానికి రూ.4వేల చొప్పున ఇచ్చిన్రు. 2019లో సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం రూ.5వేలకు పెంచిండు. ఏటా రెండు సార్లు రైతుబంధు డబ్బులు తీసుకొని పంటలేసుకుంటున్న. వానకాలం, యాసంగి సీజన్ ప్రారంభంలోనే ఖాతాల్లో డబ్బులేస్తున్రు. తెలంగాణ వచ్చి, సీఎం కేసీఆర్ అయినంక ఆ బాధల్లేకుంట చేసిండు. బుధవారం నుంచి మళ్లీ రైతుబంధు డబ్బులు పడుతున్నాయి. మస్తు సంతోషంగా ఉంది.
– కిషన్‌రెడ్డి, చండూర్ రైతు