అక్కన్నపేట, ఫిబ్రవరి 3 : మొక్కజొన్నసాగుపై రైతులు మక్కువ పెంచు కున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాల్లో గతేడాదితో పోల్చితే సుమారు రెట్టింపు సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. చెరువులు, కుంటల్లో నీళ్లు సరిగ్గా లేకపోవడం, భూగర్భ జలాలు తగ్గడం, పెట్టుబడి కూడా తక్కువ, పంట మార్పిడి విధానం, కరెంట్ స్థితిగతులు, వేసవి రాకముందే పంట కోతకు వస్తుందనే ఆలోచనతో రైతుల మొక్కజొన్నసాగువైపు దృష్టిసారించారు. గతేడాది హుస్నాబాద్ డివిజన్లో సుమారు 7 వేల ఎకరాల మొక్కజొన్న సాగుచేయగా ఈ ఏడాది 13 వేల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ చేపట్టిన పంటల నమోదు ద్వారా తెలిసింది.
వరితో పోల్చికుంటే మొక్కజొన్నసాగుకు నీరు తక్కువ అవసరం ఉంటుంది. మొక్కజొన్న చేను ప్రారంభ దశలో మినహా తర్వాత వారం రోజులకు ఒకసారి నీళ్లు పడితే సరిపోతాయి. రైతులు పెట్టుబడి తక్కువ అయ్యేలా బీటీ (దుక్కి చేయకుండా) మొక్కజొన్నసాగు చేపట్టారు. ప్రస్తుతం పలు చోట్ల తలపూవ్వు, పీచుతొడుడు, పాల కంకి, కంకులు అయిన స్థాయిలో చేన్లు ఉన్నాయి. మొత్తంగా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ రెండో వారంతో మొక్కజొన్నకోతకు వచ్చే విధంగా రైతులు సాగు చేశారు.
హుస్నాబాద్ డివిజన్లో మొక్క జొన్న సాగు పెరిగి ంది. జీరో టిల్లర్ పద్ధతిలో మొక్క జొన్న సాగు బెటర్. నీళ్లు కూడా తక్కు వ, ఎండలు ముదిరేనాటికి చేన్లు అయి పోతాయి. పంట మార్పిడి విధానంలో దిగుబడి బాగా వస్తుంది. మార్కెట్లో మక్కలకు మంచి డిమాండ్ ఉంది.
-మహేశ్, ఏడీఏ, వ్యవసాయశాఖ, హుస్నాబాద్ డివిజన్
మూడు ఎకరాల భూమి ఉంది. ఎకరం భూమి బీడు ఉంచి రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గతేడాది నీళ్లు ఎక్కువగా ఉండే. ఈ సారి భూగర్భజలాలు తగ్గాయి. ఇప్పటి నుంచే బోర్లు ఆగిఆగిపోస్తున్నాయి. అందుకే మొక్కజొన్న సాగుచేపట్టా. నెలపదిహేను రోజుల వరకు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
– సమ్మయ్య, రైతు, చౌడుతండా