నంగునూరు, ఆగస్టు 8: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఏ ఎరువుల దుకాణం వద్ద చూసినా రైతుల క్యూలే కనిపిస్తున్నాయి. యూరియా కొరత కారణంగా రైతులు క్యూలో చెప్పులు పెట్టి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. ఎకరాకు బస్తా మాత్రమే ఇస్తామని నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు రంది చెందుతున్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈ-పాస్ చేస్తుండడంతో రైతులు ఓటీపీ చెప్పడానికి సమయం పడుతున్నది. ఈ పాస్ పేరుతో చాలా సమయం గడిపి రైతులకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ వానకాలంలో నంగునూరు మండలంలో 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం 13 వేల ఎకరాలు వరినాట్లు వేశారు. ఇంకా 7 వేల ఎకరాల్లో వరినాట్లు పడాల్సి ఉంది. పత్తి 1900 ఎకరాలు, మొక్కజొన్న 800, కంది 1500 ఎకరాలు సాగు చేశారు. వీటితో పాటు కూరగాయలు, అంతర పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలకు సరిపడా యూరియా సరఫరా లేదు. వచ్చిన ఒక్క లారీ లోడుకు చాలా మంది రైతులు ఎగబడుతుండడంతో ఎవరికీ సరిపోక రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సరిపడా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ వాళ్లు ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం రోజు మొత్తం నిల్చుంటే బాయికాడ పని మొత్తం పోతాంది. దయచేసి ప్రభుత్వం, అధికారులు మాలాంటోళ్ల గురించి ఆలోచన చెయ్యుర్రి. మా రైతుల గోస ఎప్పుడు తప్పుతదో జెర అధికారులు చెప్పాలే. గిట్లయితే వ్యవుసం బంజేసుకునుడే.
– బీరకాయల యాదవ్వ, రైతు, ముండ్రాయి
సొసైటీ దుకాణం ముంగట పొద్దటి నుంచి ఎదురు సూస్తున్న. ఎకరానికి ఒక్కటే ఇస్తుర్రు. అది కూడా గంటల తరబడి నిలబడి ఉంటే ఇస్తుర్రు. ఇదేం కష్టం రైతులకు. ప్రభుత్వం ఒక్కసారి ఆలో చన చేయాలె. యూరియా బసా ్తలను సకాలంలో అందించాలె.
– శామంతుల నర్సింహులు, రైతు, పాలమాకుల
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిట్ల ఎన్నడు జరగలే. కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంకనే యూరియా కోసం ఇట్ల గంటల కొద్ది నిలబడుతున్నం. ఎనుకటి రోజులు మళ్ల తెచ్చిర్రు వీళ్లు. యూరియా కోసమే ఇక్కడుంటే చేన్ల పని ఎవరు చెయ్యాలే. యూరియా అందకపోతే పంటలు పండే పరిస్థితి అయితే కనబడుతలేదు.
– వేపాక కనకయ్య, రైతు, బద్దిపడగ