చేర్యాల, ఫిబ్రవరి 22: బీఆర్ఎస్ హయాంలో పచ్చగా మారిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు బారినపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి పంటలు పండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా మద్దూరు మండలంలోని లద్నూరు, కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్లను మత్తడి లెవల్ వరకు గోదావరి జలాలతో నింపేవారు. అనంతరం అక్కడ నుంచి కాల్వల ద్వారా గ్రామాల్లోని చెరువులకు నీటిని నింపి పొలాలకు అందించేవారు. దీంతో పంటలు పండాయి.
కరువు చాయలు లేకుండే. పస్తుతం పంటలను కాపాడేందుకు కాంగ్రెస్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టాలు తప్పేలా లేవు. పూర్తిగా రుణమాఫీ కాకపోవడం, రైతుభరోసా అందక పోవడంతో ఇప్పటికే రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇప్పుడు నీళ్లులేక యాసంగి పంటలు ఎండిపోతుండడంతో పెట్టిన పెట్టుబడులు మీద పడేలా ఉన్నాయి. బోరుబావులు ఎండిపోవడంతో కొత్తగా బోర్లు వేస్తూ రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొద్దికొద్దిగా నీరు పోస్తున్న బోరుబావుల వద్ద పడిగాపులు కాస్తూ తమ పంటలను దక్కించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవుసానికి నాణ్యమైన కరెంటు సరఫరా కాకపోవడంతో తరచూ కరెంట్ మోటర్లు కాలిపోతున్నాయి. ఈ యాసంగిలో చేర్యాల ప్రాంతంలో 120 చెరువుల కింద సుమారు 46వేల ఎకరాల్లో రైతులు వరిపంట వేశారు.
రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయని ప్రభుత్వం…
ఉమ్మడి చేర్యాల మండలంలో తపాస్‌పల్లి, ఐనాపూర్ గ్రామాల మధ్య తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను జె.చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల పథకం రెండో దశలో 0.3 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించారు. రిజర్వాయర్ ద్వారా 67ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టుగా నాటి సర్కారు నిర్ణయించింది. చెరువులు నింపి రైతులకు నీటిని అందించేందుకు 14.175 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా 48 వేలు, మిగిలిన 19వేల ఎకరాలను ఎడమ కాల్వలను నిర్మించారు. చేర్యాల, కొమురవెల్లి, ఉమ్మడి మద్దూరు మండలంతో పాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్ని గ్రామాలు, సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలంలోని కొన్ని గ్రామాల చెరువులకు నీటిని ఏటా విడుదల చేయడంతో భూగర్భజలాలు పెరిగి బోరు బావుల నుంచి పుష్కలంగా నీరు వచ్చి పంటలు పండాయి.
ఫేజ్-2లో పైపులైన్ల ద్వారా 15మిలియన్ల క్యూబిక్ ఫీట్ల జలాలు వస్తుండగా, నాటి భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-3లో 10.02మిలియన్ల క్యూబిక్ ఫీట్ల జలాలను పైపులైన్ల ద్వారా పంపింగ్ చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో ఫేజ్-2, ఫేజ్-3లో ఏటా నీటిని విడుదల చేయడంతో రిజర్వాయర్లు పూర్తిస్థ్ధాయిలో నిండి చేర్యాల ప్రాంతంలోని 120 చెరువుల్లోకి గోదావరి జలాలు చేరుకోగా రైతులకు ఎలాంటి నీటి కష్టాలు ఎదురుకాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది.
చేర్యాల ప్రాంతంలోని తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లకు సర్కారు నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో చెరువులు వెలవెలబోతున్నాయి. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ మేరకు అక్టోబర్‌లో ఒక్కసారి, జనవరిలో మరోసారి అధికారులు నీటిని రిజర్వాయర్లకు విడుదల చేశారు. నీరు పుష్కలంగా ఉన్న సమయంలో రెండు రిజర్వాయర్లను నింపి చెరువులకు నీటిని విడుదల చేయకుండా అధికారులు చేతులు దులుపుకొన్నారు. గతంలో ఉన్న విధానాలను ఎందుకు అవలంభించాలని అనుకున్నారో ఏమో, తిరిగి నీటిని పంపింగ్ చేయడం నిలిపివేశారు. రిజర్వాయర్లలో కొంత మేరకు నీటిని నిల్వ చేశారు. రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో ఆయా గ్రామాల్లోని చెరువులకు నీటిని పంపింగ్ చేయకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి, బోరుబావుల నుంచి చుక్క నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో తమ పంటలను మూగజీవాలకు వదిలి పెడుతున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు బోర్లు తవ్విస్తున్నారు. ప్రతి మండలంలో నిత్యం 20 వరకు బోర్లు వేయిస్తున్నారు. ఇందులో ఒకటి రెండు మినహా మిగిలిన బోర్లలో నీరు పడటం లేదని బోరుబండ్ల నిర్వాహకులు చెబుతున్నారు. కొన్నేండ్లుగా తాము ఇలాంటి పరిస్థితి చూడలేదని, రైతుల పరిస్థితి చూస్తే తమకే బాధ కలుగుతున్నట్లు బోరుబండ్ల నిర్వాహకులు తెలిపారు. ఒక్కో రైతు దాదాపు 800 ఫీట్ల మేరకు బోరు వేసినప్పటికీ నీళ్లు రావడం లేదు. దీనికి తోడు తరచూ బోరుమోటర్లు కాలిపోతుండడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
కాంగ్రెస్‌కు రైతులంటే చిన్నచూపు
కాంగ్రెస్ సర్కారుకు రైతులంటే మొదటి నుంచి చిన్నచూపే. రైతులకు సాగునీటిని అందించేందుకు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయించి పూర్తిస్థాయిలో గోదావరి జలాలు నింపాలి. అక్కడి నుంచి ప్రాధాన్యతపరంగా చెరువులకు నీటిని విడుదల చేయాలి. పంటలు బాగా పండితే ఎక్కడ వడ్లు కొనాల్సి వస్తుందో అని నీటి విడుదల నిలిపివేసింది.అందుకే రిజర్వాయర్లు నింపడం లేదు. పంటలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తాం. తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లలోకి వెంటనే నీటిని విడుదల చేసి చెరువులనే నింపి పంటలు కాపాడాలి.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే