చేర్యాల, ఏప్రిల్ 16: రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్నాడు. పంట చేతికొచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతన్న రైస్ మిల్లర్లను ఆశ్రయిస్తున్నాడు. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు మిల్లర్లు రైతులను నిండాముంచుతున్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన ఓ రైస్‌మిల్లుకు వెళ్తే అక్కడ దోపిడీకి గురైన విషయాన్ని రైతు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ధాన్యాన్ని రైతు నేరుగా మిల్లుకు తీసుకుపోతే వివిధ రకాలుగా దోపిడీకి గురవుతున్నాడు. ధాన్యం రైస్‌మిల్లుకు తీసుకెళ్తే వ్యాపారికి చెందిన సొంత కాంటాలో మొదట ట్రాక్టర్‌ను తూకం వేసి రూ.100 వసూలు చేస్తున్నారు. క్వింటాలుకు హమాలీ పేరిట రూ.25 వసూలు చేస్తున్నారు.
ట్రాక్టర్లో తెచ్చిన ధాన్యాన్ని అక్కడే ఉన్న కాంటాలో తూకం వేసి మిల్లు ఆవరణలో కుప్పగా పోసి వెళ్లిపోతారు. హమాలీలు ఆ ధాన్యాన్ని ముట్టుకోరు. కానీ, హమాలీ పేరిట రైతు వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. క్వింటాలు ధాన్యానికి మూడు కిలోలు తరుగు పేరిట కట్ చేసి, 97 కిలోలకు డబ్బులు చెల్లిస్తున్నారు. రైతుకు వెంటనే డబ్బులు కావాలంటే రైస్‌మిల్లుకు తీసుకొచ్చి విక్రయించిన ధాన్యం నగదు నుంచి 2 శాతం కట్ చేసి చెల్లిస్తున్నారు. లేదంటే 25 రోజుల తర్వాత రైతుకు డబ్బులు చెల్లిస్తున్నారు.
ప్రారంభం కాని
కొనుగోలు కేంద్రాలు
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రారంభించినా, మెజార్టీ గ్రామాల్లో ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ప్రతి గింజనూ కొంటామనంటూ ప్రభుత్వం ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రైస్‌మిల్లర్ల వద్ద రైతులు దోపిడీ గురికాకముందే కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనే ప్రక్రియ ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.