అక్కన్నపేట, ఏప్రిల్ 28: కాంగ్రెస్ సర్కార్ రైతులను మొదటి నుంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతుబంధు, రైతు భరోసా ఎగ్గొట్టడం, సన్నాల బోనస్ బోగస్, యూరియా కొరత, అరకొర విద్యుత్ సరఫరాతో కొట్టుమిట్టాడిన రైతులు తాజాగా వడ్లు అమ్ముకునేందుకు ఆన్లైన్ యాప్ ప్రవేశపెట్టింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు యాప్ ద్వారా రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద ఉన్న ట్యాబ్‌లో ధాన్యం విక్రయించే రైతుల వివరాలను అప్పటికప్పుడు డేటా ఎంట్రీ, ధాన్యాన్ని తరలించేందుకు జీపీఎస్ కలిగిన లారీలు, డీసీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా మిల్లును చూపిస్తోంది. ఈ మిల్లు కేటాయింపు అనేది జిల్లాలో ఎక్కడైనా రావచ్చు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు సర్కార్ కొర్రీలు పెడుతున్నది. యాప్ పేరిట రైతులను తిప్పలు పెడుతున్నది. యాప్‌ను ఎత్తివేయాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆన్లైన్ యాప్ ద్వారా మాత్రమో కొనుగోళ్లు చేయాలని శనివారం సాయంత్రం నుంచి షరతు పెట్టడంతో జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పుట్ల కొద్ది వడ్లకుప్పలు కనిపిస్తున్నాయి. పలు కొనుగోలు కేంద్రాల్లో నింపిన ధాన్యం బస్తాలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోయాయి. ధాన్యం విక్రయాలకు యాప్ తీసుకురావడంతో క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోల్చితే ఈ విధానంలో ధాన్యం తరలింపు ప్రక్రియ ఆలస్యం కానుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీనికి తోడు జీపీఎస్ కలిగిన లారీలు రావడం, మిల్లుల కేటాయింపు జరగడం అనేది నిర్వాహకులచేతులో లేనిపని కాడంతో వారు రైతులకు ధాన్యం తరలింపునకు కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. వర్షం పడితే రైతులకు తీరని ఆన్యాయం జరుగుతుంది. తడిసిన వడ్లు, బస్తాలను తిరిగి ఆరబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. సిద్దిపేట జిల్లా సివిల్ సప్లయ్ శాఖ నిర్వహణలో ధాన్యం కొనుగోల ప్రక్రియ కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 509 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 421 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో సింగిల్ విండో ద్వారా 202, మిగతా 211 మహిళా సంఘాలు, మెప్మా ద్వారా ఆరు, ఎఫ్‌పీవో ద్వారా రెండు ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు అరిగోస పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ధాన్యం ఉంచి కాలం గడిపె పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికి కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోగా, మరికొన్ని చోట్ల మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు జరగడం లేదు. నిబంధనల పేరిట ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేసరికి రెండు నెలల సమయం పట్టే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవు. మ్యానువల్ వ్యవస్థ ఉండటంతో కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేసి త్వరగా ధాన్యం కొనుగోలు చేపట్టారు. మిల్లులు మంజూరు ముందుగానే జరిగేది. కొనుగోలు కేంద్రాల నుంచి గరిష్టంగా 15 కిలోమీటర్లలోపే మిల్లుల కేటాయిం పు ఉండటంతో స్థానిక ట్రాక్టర్ల ద్వారా వడ్ల బస్తాలను తరలించేది. ట్రక్‌షీట్‌తో మిల్లుల్లో వడ్ల దిగుమతి జరిగేది. ట్యాబ్‌లో రైతు వివరాలు, బస్తాలు ఎంట్రీ చేయడంతో మిల్లర్లు సరిచూసుకొని ఆమోదం తెలుపగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. ఇదంతా కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే జరిగేది.

దుబ్బాక, ఏప్రిల్28: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వెంటనే కాంటా పెట్టాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డులో 10 రోజుల కిందట ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్ప టి వరకు కాంటా వేయడం లేదని పలువురు రైతులు మంగళవారం ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, విద్యుత్ దీపాలు , జల్లియంత్రాలు లేక ఇబ్బందిగా మారిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయక సమస్య నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతికి ఫోన్లో సమస్య విన్నవించారు. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ ఎమ్మెల్యేకు తెలిపారు. దుబ్బాక మండలంలోని గోసాన్‌పల్లి, రఘోత్తంపల్లి, ఆకారం గ్రామాల్లో ఇదే దుస్థితి ఉందని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు.
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండే విధంగా ఆన్లైన్ యాప్ ప్రవేశపెట్టాం. దీనివల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్ల మధ్య మిలాకత్ తొలిగిపోతుంది. జీపీఎస్ కలిగిన వాహనాల్లో ధాన్యం తరలించడం వల్ల వాహన రవా ణా కదలికలు తెలిసిపోవడంతో పాటు సురక్షితంగా వాహనం మిల్లులకు చేరుతుంది. ఎలాం టి అక్రమాలకు ఆస్కారం ఉండదు. ఈ యాప్ ప్రక్రియ సులువుగానే ఉంటుంది. నిర్వాహకులకు యాప్‌పై కొంత అవగాహన రావాల్సి ఉంది.
– గోపీకృష్ణ, జిల్లా మేనేజర్(డీఎం), సివిల్ సప్లయ్, సిద్దిపేట జిల్లా