రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగే కథ ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం భావోద్వేగభరితంగా సాగింది. ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు ఓ తండ్రి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? కూతురితో పాటు ఊరిలోని ఆడపిల్లల రక్షణ కోసం ఆ తండ్రి ఎలాంటి నిర్ణయాల్ని తీసుకున్నాడనే అంశాలతో ట్రైలర్ ఎమోషనల్‌గా సాగింది.
‘నాకో బలహీనత ఉంది. ఏ ఆడకూతుర్ల్లో అయినా నా కూతురిని చూసుకోవడం..దాని జోలికి రాకు’ అనే డైలాగ్ కథ తాలూకు భావోద్వేగాల తీవ్రతకు అద్దం పట్టింది. అయ్యప్ప దీక్ష నేపథ్యం కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది.ప్రియాభవానీశంకర్, సాయికుమార్, బేబీ నక్షత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.