గజ్వేల్, జూన్ 9: ఈసారి రైతులు విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వానకాలం వచ్చినా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తికాక పోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలోల పడిగాపులు పడుతున్నారు. మరోవైపు వానకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. రోహిణికార్తె మరుసటి రోజు కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లాలో రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేసుకున్నారు.సోమవారం నుంచి మృగశిరకార్తె, నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో రైతులు పొడి నేలలోనే పత్తి విత్తనాలు పెడుతున్నారు. వర్షాలు కురిసిన వెంటనే అనుకున్న సమయానికి మక్క, పప్పు దినుసుల విత్తనాలు విత్తుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి యాసంగి వడ్ల కొనుగోళ్లు ఇంకా ముగియక పోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రైతులు దిగులు పడ్డారు.
సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో 5.50క్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగుచేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. రైతులు ఎక్కువగా వరి, పత్తి,మక్క, పప్పు దినుసులు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో 3లక్షల మంది రైతులు ఉన్నారు. 3.50లక్షల ఎకరాల్లో వరి, 1.10లక్షల ఎకరాల్లో పత్తి, 40వేల ఎకరాల్లో మక్క, కందులు, 8వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనుండగా, వానకాలం లో సుమారు 90వేల టన్నుల ఎరువులు వినియోగిస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అందులో యూరి యా 45వేల టన్నులు, పొటాష్ 5వేల టన్నులు, కాంప్లెక్స్ 15వేల టన్నులను రైతులు వినియోగిస్తారు. పెరిగిన ధరలతో రైతులపై జిల్లాలో కోట్లాది రూపాయల భారం పడనున్నది. సిద్దిపేట జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు వర్షాధారంగా పంటలు సాగుచేస్తారు. కొంతమంది రైతులు నీటి ఆధారిత వరి పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి వసతులు ఉన్న రైతులు ముందస్తుగా దీర్ఘకాలిక రకం వరిని సాగుచేస్తారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా సుమారు 3.50లక్షల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మృగశిర కార్తె రాకతో రైతు లు నార్లు పోసుకునేందుకు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు.
రైతులపై సాగుభారం రోజురోజుకూ పెరుగుతున్నది. వానకాలం సాగుకు రైతులు వేసవి దుక్కులు సిద్ధం చేసుకున్నారు. రోహిణికార్తెలో రావడంతో గజ్వేల్ మండలం రిమ్మనగూడ, దాచారం, బయ్యారం తదితర గ్రామాల్లోని నల్లరేగడి భూముల్లో అప్పుడే రైతులు పొడి నేలలోనే పత్తి విత్తనాలు పెట్టారు. మృగశిరకార్తె ప్రవేశంతో తప్పకుండా వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా మారా రు. పెట్రో, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో రైతులపై మరింత పెట్టుబడిభారం పడుతున్నది. గతంలో కాడెడ్లతో సాగు పనులు చేసేవారు.కానీ, మారుతున్న కాలనుగుణంగా ఎక్కడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎక్కువ శాతం మంది రైతులు ట్రాక్టర్లతో దున్నకాలు చేపడుతున్నారు.
యాసంగిలో పండించిన ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో ఇంకా ధాన్యం కాంటా కావాల్సి ఉంది. వర్షాలు కురిస్తే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్‌కు నేటికీ రైతులు ధాన్యం తెస్తున్నారు. గజ్వేల్ డివిజన్ పరిధిలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం సకాలంలో వేయకపోవడంతో రైతులు వానకాలం పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులకు రైతుభరోసా పెట్టుబడిసాయం రాకపోవడంతో వ్యాపారుల వద్ద విత్తనాలు, ఎరువులు వడ్డీలకు తెచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు పనులకు ముందే రైతుబంధు వేసేవారు. ఆ డబ్బులతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేవారు. పెరిగిన దున్నకాల ఖర్చులు, ఎరువుల ధరల పెంపుతో రైతులు ఈసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చేర్యాల, జూన్ 9: ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని చెబుతున్న సీఎం, మంత్రు లు, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయి లో కొనుగోలు ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మొదటగా రైస్‌మిల్లుల జీయో ట్యాగింగ్ పేరిట ఆలస్యం చేసిన సర్కార్ అనంతరం నెమ్మదిగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడంతో రైతులకు తిప్పలు ప్రారంభమయ్యాయి. వాతావరణ పరిస్థితులు మారడం, లారీలు రాకపోవడం, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయక అలాగే ఉండడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాల్లోని వివిధ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం రాశులు ఉన్నాయి.లారీలు రాక కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది.మండలంలోని కమాయపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 12 లారీల వడ్ల రాశులు ఉన్నాయి. అధికారులు, కేంద్రాల నిర్వాహకులు సైతం శ్రద్ధ తీసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.